ఫ్యాక్ట్ చెక్ : ఉత్తర ప్రదేశ్ వీడియో ఆంధ్ర పోలీసులు వాహనాలపై రాళ్లు రువ్వారు అంటూ షేర్ అవుతోంది
వైరల్ అవుతున్న వీడియో ఉత్తర ప్రదేశ్ కి చెందినది, దీనిని తప్పుగా ఆంధ్ర ప్రదేశ్ కి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఒక పెద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మరియు ద్విచక్ర వాహనం ఢీకొని, 20 మందికి పైగా తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ సంఘటన అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు బస్సుల తనిఖీకి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.
ఈ సందర్భంలో ఒక 20 సెకెన్ల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ కు శీర్షికగా, “లంచం కట్టు లేదంటే రాళ్లతో కొట్టు. ఇందుకు కదా మనం ఈ దరిద్రపుగొట్టు ప్రభుత్వని ఎన్నుకున్నది. మన టాక్స్ డబ్బులతో ఈ సన్నుసలకు జీతాలు కడుతున్నది. శభాష్,” అంటూ రాసుకొచ్చారు. పైగా, తెలుగు దేశం పార్టీ అధికారిక X అకౌంట్ ను ట్యాగ్ చేసి అసభ్యకర పదజాలంతో సంబోధించారు. ఇతర యూజర్ల కూడా ఇదే తరహా లో రాసి షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెక్ :
కానీ, ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టించే విధంగా ఉంది, ఎందుకంటే, ఆ వైరల్ వీడియో ఉత్తర ప్రదేశ్ కు చెందినది.
ఈ వీడియో వైరల్ అవుతున్న తరుణంలో, తెలుగు పోస్ట్ నిజనిర్ధారణ బృందం ఈ క్లెయిమ్ ను పరిశీలించింది. ఈ పరిశీలనలో, వైరల్ వీడియో ఉత్తర ప్రదేశ్ లోని సోన్‌భద్ర జిల్లా కు చెందినది అని తేలింది.
మొదటిగా, ఈ వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, సెప్టెంబర్ 2025 లో ప్రచురితమైన అనేక వార్తా కథనాలు లభించాయి.
వీటిలో, దైనిక్ భాస్కర్ అనే సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం, ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని సోన్‌భద్ర జిల్లాలో రోబెర్ట్సగంజ్ కొత్వాలీ లో ఉన్న లోధీ టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. పైగా, మినరల్ మాఫియాకి చెందిన వాహనాలు అక్కడ ఉన్న సర్వేయర్ ను ఢీ కొని వెళ్లగా, వాటిని ఆపేందుకు పోలీసులు రాళ్లు రువ్వి నట్టు కథనం పేర్కొంది.
పైగా, కొన్ని కీవర్డ్స్ ఆధారంగా వెతుకగా, తమ X అకౌంట్ లో సోన్‌భద్ర జిల్లా పోలీసులు ఈ విషయం గురించి ఇచ్చిన అధికారిక ప్రకటన కూడా లభించింది.
హిందీ లో ఉన్న ఈ పోస్టును తెలుగు లోకి అనువదించగా, ఈ విధంగా తెలియజేస్తుంది. “ఈ కేసులో తెలియజేయాల్సింది ఏంటంటే, నిన్న 12.09.2025న రాత్రి 11.40 గంటల ప్రాంతంలో లోధి బారియర్ వద్ద మినరల్ సూపర్‌వైజర్ యోగేష్ శుక్లా తనిఖీలు చేస్తున్నారు. మినరల్ సూపర్‌వైజర్ తనిఖీ కోసం కొన్ని ట్రక్కులను ఆపడానికి ప్రయత్నించాడు, దానిపై ట్రక్ డ్రైవర్లు వాహనాలను ఆపడానికి బదులుగా, అధిక వేగంతో మరియు నిర్లక్ష్యంగా నడిపి, మినరల్ సూపర్‌వైజర్‌ను చంపాలనే ఉద్దేశ్యంతో ఆయనపైకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది ట్రక్కులను ఆపినప్పుడు, ట్రక్ డ్రైవర్లు ఎదురుగా ఉన్న లేన్‌లో వాహనాలను నడపడం ప్రారంభించారు, దానిపై పోలీసు సిబ్బంది ట్రక్కులను ఆపడానికి ప్రయత్నించారు. ట్రక్కుల ద్వారా చంపాలనే ఉద్దేశ్యంతో తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసాము, పైగా, సంబంధిత పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ చర్యలు ప్రారంభమయ్యాయి, ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ రాబర్ట్స్‌గంజ్‌ను లైన్ డ్యూటీలో ఉంచారు.”
పైగా, ఈ క్లెయిమ్ ను ఆంధ్ర ప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ విభాగము కూడా నిజ నిర్ధారణ చేసింది. తమ పోస్టులో ఈ విధంగా రాసుకొచ్చారు, “ఆంధ్రప్రదేశ్ పోలీసులపై కొందరు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లో గత నెల 13న జరిగిన ఒక సంఘటన ఫోటోలు, వీడియోలు ఆంధ్ర ప్రదేశ్ లో జరిగినట్లు ప్రచారం చేయడమే కాక పోలీసు వ్యవస్థను, ప్రభుత్వం మొత్తాన్ని కించపరిచే దుర్భాష వాడటం అభ్యంతరకరం. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారి పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడమైనది.”
ఈ పై ఆధారాలను పరిశీలించిన తర్వాత, పై వైరల్ వీడియో ఉత్తర ప్రదేశ్ కి చెందినది అని అర్థమవుతుంది. కానీ, దీనిని తప్పుగా, ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వీడియోగా షేర్ చేస్తున్నారు. కనుక ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టించే విధంగా ఉంది.