ఫ్యాక్ట్ చెకింగ్: కల్వకుంట్ల కవితను కేటీఆర్ చేయి పట్టుకుని తీసుకుని వెళ్తున్న విజువల్స్ ఇప్పటికి కావు
కల్వకుంట్ల కవితను కేటీఆర్ చేయి పట్టుకుని తీసుకుని వెళ్తున్న
ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురికి క్లీన్ చీట్ ఇస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సీబీఐ నమోదు చేసిన కేసును కోర్టు కొట్టివేయడంతో ఈ కేసులో ఉన్న నిందితులందరికీ ఊరట లభించింది.
సీబీఐ అధికారులు తొలుత 2022 డిసెంబరులో హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మద్యం కేసులో కవిత తరఫున కార్యకలాపాలు సాగించారంటూ హైదరాబాద్‌కు చెందిన పలువురిని కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. ఈడీ అధికారులు 2024 మార్చి 15న కవితను అరెస్ట్ చేసి ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. ఆమె జైల్లో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. సుమారు 5 నెలల జైలు జీవితం అనంతరం, ఆగస్టు 27న ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.
కల్వకుంట్ల కవితను కేటీఆర్ చేయి పట్టుకుని తీసుకుని వెళ్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. కల్వకుంట్ల కవిత, కేటీఆర్ కలిసిపోయారంటూ పలువురు పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ ఉన్నాయి
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
కోర్టు తీర్పు తర్వాత ఎక్స్ వేదికగా స్పందించిన కల్వకుంట్ల కవిత 'సత్యమేవ జయతే' అంటూ ట్వీట్ చేశారు. కోర్టులపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని రుజువైందని కవిత తెలిపారు. తాను కడిగిన ముత్యంలా ఈ కేసులో నుంచి బయటికి వస్తానని మొదటి నుంచి తెలంగాణ ప్రజలకు చెబుతున్నానని.. ఇప్పుడు అలాగే వచ్చానని వెల్లడించారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని తాను ఎన్నోసార్లు చెప్పానని, అదే ఇప్పుడు నిజమైందని అన్నారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు క్లీన్ చిట్ ఇస్తూ వచ్చిన తీర్పుపై కేటీఆర్ స్పందించారు. మద్యం కుంభకోణం పేరుతో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేశారని, తెలంగాణలో ఆ కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన లింక్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఇక వైరల్ అవుతున్న విజువల్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అయితే ఆ విజువల్స్ ఇటీవలివి కావని స్పష్టంగా తెలుస్తోంది. 2024, ఆగస్టు నెల నుండి ఈ విజువల్స్ సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి.
ఐదున్నర నెలలు జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అప్పట్లో బెయిల్ లభించడంతో ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. బంజారాహిల్స్‌లోని తన నివాసానికి వచ్చిన ఆమెకు కేటీఆర్ సతీమణి శైలిమ హారతిచ్చి లోపలికి ఆహ్వానించారు. అక్కడ సమీప బంధువులు, పార్టీ ముఖ్యులను ఆమె పలకరించారు. ఇంట్లోకి వెళ్లాక తల్లి శోభ ఆశీర్వాదం తీసుకున్నారు. పూజామందిరంలోకి వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం భర్త అనిల్‌కుమార్‌కు పాద నమస్కారం చేసి, అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టారు. ఆ సమయంలో కేటీఆర్ చేయి పట్టుకుని కవితను ఇంట్లోకి తీసుకుని వెళ్లారు.
అందుకు సంబంధించిన లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
తీహార్ జైలు నుండి విడుదలయ్యాక బంజారా హిల్స్ లోని తన నివాసానికి చేరుకున్న కవితకు సంబంధించిన మీడియా నివేదికలను ఇక్కడ చూడొచ్చు
ఆ సమయంలో రికార్డు చేసిన విజువల్స్ ను ఇప్పటివిగా షేర్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
Claim : వైరల్ అవుతున్న విజువల్స్ ఇప్పటివి కావు. 2024 సంవత్సరం ఆగస్టు నెల నుండి ఆన్ లైన్ లో ఉన్నాయి
Claimed By : Social Media Users
Fact Check : Unknown