ఫ్యాక్ట్ చెక్: టీ20 ప్రపంచ కప్ లో భారతజట్టు విజయం సాధించాక ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
టీ20 ప్రపంచ కప్ లో భారతజట్టు విజయం సాధించాక ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారంటూ
టీ20 ప్రపంచకప్ విజేతగా టీమిండియా వరుసగా రెండో నిలిచింది. 2007లో టైటిల్ సాధించిన భారత జట్టు 2024, 2026లో కూడా గెలుచుకుని మొత్తంగా మూడుసార్లు కప్‌ను తన ఖాతాలో వేసుకుంది. విజేతగా నిలిచిన టీమిండియాకు రూ.24.25 కోట్లు, రన్నరప్ న్యూజిలాండ్‌కు రూ.13.08 కోట్లు ఐసీసీ నుండి దక్కాయి. సెమీ ఫైనల్ వరకు వచ్చిన దక్షిణాఫ్రికాకు రూ.9.24 కోట్లు, ఇంగ్లండ్‌కు రూ.8.96 కోట్లు అందాయి. సూపర్ 8లో నిష్క్రమించిన వెస్టిండీస్‌కు రూ.4.95 కోట్లు, పాకిస్థాన్‌కు రూ.4.80 కోట్లు, జింబాబ్వేకు రూ.4.52 కోట్లు, శ్రీలంకకు రూ.4.39 కోట్లు అందాయి. లీగ్ స్టేజిలో నిష్క్రమించిన ఆప్ఘనిస్థాన్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా జట్లకు ఒక్కోదానికి రూ..2.85 కోట్ల చొప్పున అందాయి. స్కాట్లాండ్‌కు రూ.2.56 కోట్లు, ఐర్లాండ్‌కు రూ.2.50 కోట్లు వచ్చాయి. ఇటలీ, నెదర్లాండ్స్, యూఏఈ, నేపాల్ జట్లకు ఒక్కో దానికి రూ.2.35 కోట్లు, కెనడా, నమీబియా, ఒమన్ జట్లకు ఒక్కో దానికి రూ.2.06 కోట్ల చొప్పున పంపిణీ చేసినట్లు ఐసీసీ తెలిపింది.
భారత జట్టు మూడో సారి టైటిల్ ను సొంతం చేసుకోవడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మరింత ఎక్కువైంది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఉన్న భారతీయులు ఎంతో ఆనందంతో సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే భారత జట్టు విజయంతో ఆఫ్ఘనిస్థాన్ లో కూడా పలువురు వీధుల్లోకి వచ్చి ఆనందంగా కేరింతలు కొట్టారంటూ కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"పాకిస్తాన్ లో ఏడుపులు ఆఫ్ఘనిస్తాన్ లో వెడుకలు
భారత్ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ కాబూల్‌లో భారీ సంబరాలు జరుగుతున్నాయి
ICC T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ క్రికెట్ జట్టును ఓడించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో అభిమానులు వీధుల్లోకి తరలివచ్చారు. ప్రతిచోటా బాణసంచా, చీర్స్ & ఆనందం.
క్రికెట్ మరోసారి సరిహద్దులు దాటి ప్రజలను ఒకచోట చేర్చింది." అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
వైరల్ స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో సెప్టెంబర్ 2025 నుంచే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేసాం. అయితే ఇటీవల భారత్ టీ20 ప్రపంచ కప్ లో విజయం సాధించిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ లో సంబరాలు జరుపుకున్నారనే వాదనతో ఎలాంటి కథనాలు మాకు లభించలేదు.
వైరల్ వీడియోలోని కీ ఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాం. అయితే ఈ వీడియో సెప్టెంబర్ 2025 నుంచే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉందని గుర్తించాం.
వీడియో షేర్ చేసిన ప్రొఫైల్ ను కూడా మేము గమనించాం. Fresh Dami Chowk and the winning moments of cricket అంటూ ఫోటోలను కూడా షేర్ చేశారు.
అలాగే రీల్ ను కూడా షేర్ చేశారు.
2025 సెప్టెంబర్ 2న UAE ట్రై-సిరీస్‌లో జరిగిన 4వ T20 మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్‌పై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ సమయంలో ఆఫ్ఘన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఆ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 169 పరుగులు చేయగా ఛేజింగ్ లో పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఫ్ఘనిస్థాన్ 18 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయాన్ని ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు ఎంజాయ్ చేశారు.
https://www.cricbuzz.com/live-
ఇదే వీడియోను పలువురు సోషల్ మీడియా ఖాతాలలో పోస్టు చేశారు.
ఇక టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7, 2026న మొదలై మార్చి 8, 2026న ముగిసింది. మార్చి 8న జరిగిన ఫైనల్ లో భారత జట్టు న్యూజిలాండ్ జట్టుపై ఘన విజయాన్ని సాధించింది.
వైరల్ విజువల్స్ 2025 సెప్టెంబర్ నెల నుండి అందుబాటులో ఉన్నాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. భారతజట్టు ప్రపంచ కప్ ను గెలవగానే ఆఫ్ఘనిస్థాన్ లో అంబరాన్నంటిన సంబరాలంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.