ఫ్యాక్ట్ చెక్: ఎయిర్ చీఫ్ మార్షల్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను తప్పుదోవ పట్టించే వాదనతో షేర్ చేస్తున్నారు
ఎయిర్ చీఫ్ మార్షల్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను
భారత రక్షణ రంగంలోని స్వదేశీ తయారీ తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ ఫైటర్ జెట్ కుప్పకూలిపోయిందంటూ సామాజిక మాధ్యమాలు, పలు వార్తా ఛానళ్లలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ వార్తలపై విమానాల తయారీ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) స్పందించింది. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పింది. విమానం కూలిపోలేదని, కేవలం ఒక చిన్న సాంకేతిక లోపం మాత్రమే తలెత్తిందని స్పష్టతనిచ్చింది. తేజస్ ఫైటర్ జెట్‌లోని బ్రేకింగ్ సిస్టమ్‌లో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తిందని, దీంతో రన్‌వేపై విమానం ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు.
తేజస్ ఫైటర్ జెట్ విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉండడంతో భారత వైమానిక దళం ఎయిర్ చీఫ్ మార్షల్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ క్రాష్ ఫుటేజ్‌తో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ డ్యాన్స్ చేస్తున్న ఫుటేజ్‌ను షేర్ చేస్తున్నారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
ఇటీవలి కాలంలో తేజస్ జెట్లు కూలిపోయినట్లు వచ్చిన వాదనలను హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఖండించింది. ఫిబ్రవరి 7వ తేదీన కూలినట్లు వచ్చిన వార్తలను యుద్ధ విమానాల తయారీ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఖండించింది. యుద్ధ విమానం కూలిపోలేదని, అందులో చిన్న సాంకేతిక లోపం మాత్రమే తలెత్తిందని స్పష్టతనిచ్చింది. లోపాన్ని సరిచేయడానికి తాము భారత వైమానిక దళంతో కలిసి పని చేస్తున్నామని తెలిపింది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇక వైరల్ వీడియోలోని స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. సెప్టెంబర్ 30, 2025న ది ట్రిబ్యూన్ యూట్యూబ్ ఛానెల్ లో అప్‌లోడ్ చేసిన క్లిప్ మాకు లభించింది.
సెప్టెంబర్ 28న ఇన్‌స్టాగ్రామ్ పేజీ మిలిటరీ మంత్రలో కూడా ఈ వీడియోను షేర్ చేశారు. ఇటీవలి తేజస్ సంబంధిత పరిణామాల కంటే ముందే జరిగిందని ఈ టైమ్ స్టాంప్ నిర్ధారిస్తుంది.
పలు మీడియా కథనాల ప్రకారం 1960ల నుండి భారత వైమానిక దళానికి సేవలందించిన రష్యన్ మిగ్-21 ఫైటర్ జెట్ పదవీ విరమణ వేడుక సందర్భంగా ఈ వీడియో రికార్డ్ చేశారు. సోవియట్ యుగం నాటి మిగ్-21 విమానాలకు రిటైర్మెంట్ ఇచ్చిన సందర్భంగా సెప్టెంబర్ 26, 2025న చండీగఢ్‌లో గ్రాండ్ గా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
బాలీవుడ్ సాంగ్ ‘హవన్ కరేంగే’కు భారత వైమానిక దళం(IAF) చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ స్టెప్పులు వేశారంటూ సెప్టెంబర్ 2025లో పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎప్పుడూ గంభీరంగా కనిపించే వాయుసేన చీఫ్ ఉత్సాహంగా డాన్స్ చేస్తుండడంపై నెటిజన్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
అమర్ ప్రీత్ సింగ్ డాన్స్ చేసిన వీడియో ఏ పార్టీలో చిత్రీకరించింది అనే వివరాలను తెలుగుపోస్టు స్వయంగా ధృవీకరించలేకపోయింది. అయితే ఈ వీడియో మాత్రం ఇటీవలి కాలంలో చోటు చేసుకున్నది కాదని స్పష్టంగా తెలుస్తోంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
Claim : వీడియో ఇటీవలిది కాదు. 2025, సెప్టెంబర్ నెల నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది
Claimed By : Social Media Users
Fact Check : Unknown