ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిలో 26 మంది మృతి చెందినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ పాకిస్తాన్ ,ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిన తర్వాత, పాకిస్తాన్ భారతదేశం పశ్చిమ సరిహద్దుల్లోని వివిధ ప్రదేశాలలో డ్రోన్, క్షిపణి దాడులను ప్రారంభించింది. భారత సాయుధ దళాలు వాయు రక్షణ వ్యవస్థలను ఉపయోగించి వాటిని అడ్డుకున్నాయి. సైన్యం, X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేసిన పత్రికా ప్రకటనలో, “ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ సాయుధ దళాలు 2025 మే 08- 09 మధ్య రాత్రి మొత్తం పశ్చిమ సరిహద్దులో డ్రోన్లు, ఇతర మందుగుండు సామగ్రిని ఉపయోగించి బహుళ దాడులను ప్రారంభించాయి. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు అనేక కాల్పుల విరమణ ఉల్లంఘనలకు తెగబడ్డాయి. వాటికి భారత్ సరైన సమాధానం ఇచ్చింది. భారత సైన్యం డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత ఆర్మీ దేశం సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉంది.” అంటూ పోస్టు పెట్టింది.
ప్రతీకార చర్యలను తీవ్రతరం చేయకుండా భారతదేశం ఓర్పుగా వ్యవహరిస్తూ ఉంది. ఇంతలో, భారత సైనికులు ఏడుస్తూ, మరొక సైనికుడిని కౌగిలించుకుంటున్న వీడియోను పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేస్తున్నారు. భారత సైనికులు ఏడుస్తూ సరిహద్దుకు వెళ్లడానికి నిరాకరిస్తున్నారనే తప్పుడు కథనంతో పోస్టులు పెడుతున్నారు. “بھارتی فوجی کا بارڈر پر جانے سے انکار پاک فوج زندہ باد” అంటూ ఉర్దూలో పోస్టులు పెట్టారు. "భారత సైనికులు సరిహద్దులకు వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు, పాకిస్తాన్ సైన్యం వర్థిల్లాలి" అంటూ అర్థం వచ్చేలా పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో పాతది. భారత సైన్యానికి ఎంపికైన ఒక సైనికుడి భావోద్వేగాన్ని చూపిస్తుంది.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మే 3, 2025న "ఇండియన్ ఆర్మీ" అనే శీర్షికతో డిఫెన్స్ లవర్ అనే యూట్యూబ్ ఛానెల్ లో వీడియో షేర్ చేశారని మాకు తెలిసింది.
Indore Physical Academy అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా మే 3, 2025న వీడియోను షేర్ చేశారు.
మరింత శోధించగా, ‘ది రాష్ట్రధర్మ’ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా కనిపించింది. ఆ వీడియోను ‘ఓల్డ్ వీడియో అలర్ట్! ఇండోర్ ఫిజికల్ అకాడమీ’ అనే శీర్షికతో షేర్ చేశారు.
‘ఇద్దరు సైనికులు దేశాన్ని కాపాడటానికి సైన్యంలో చేరారు’ అని పేర్కొంటూ ఇండియన్ ఫిజికల్ అకాడమీ ఏప్రిల్ 20, 2025న షేర్ చేసిన నిడివి ఎక్కువ ఉన్న వీడియోను మాకు లభించింది. ఆ వీడియోలో ఇండోర్ ఫిజికల్ అకాడమీ వాటర్‌మార్క్ ఉంది.
ఈ వీడియోలో ఒక ప్రైవేట్ డిఫెన్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుండి విద్యార్థులు భారత సైన్యంలోకి ఎంపికైనందుకు జరుపుకుంటున్న దృశ్యం అని తెలుస్తోంది. వీడియోలోని యువకులు భారత సైన్యంలో చేరామనే వార్త విన్న ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారని తెలుస్తోంది.
కాబట్టి, వైరల్ అవుతున్న ఈ వీడియో, భారత సైన్యంలోకి ఎంపికైన విద్యార్థులు భావోద్వేగానికి గురవుతున్నట్లు చూపించే పాత వీడియో. భారత సైనికులు విధులకు యుద్ధంలో పోరాడడానికి వెళుతూ ఏడుస్తున్నారనే వాదన నిజం కాదు.