ఫ్యాక్ట్ చెక్: ట్రంప్ విమర్శించినా కూడా ప్రధాని మోదీ నవ్వుతూ ఉండిపోయారనే వాదన నిజం కాదు
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఫిబ్రవరి 12న ఫ్రాన్స్ నుంచి అమెరికాకు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు
By - Satya Priya BNUpdate: 2025-02-18 09:42 GMT
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఫిబ్రవరి 12న ఫ్రాన్స్ నుంచి అమెరికాకు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ద్వైపాక్షిక చర్చలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆతిథ్యం ఇచ్చారు. శ్వేతసౌధంలో ట్రంప్‌తో మోదీ సమావేశమై వివిధ కీలక అంశాలపై భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలపై చర్చించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీతో విలేకరుల సమావేశం నిర్వహించారు. అక్కడ పలువురు అమెరికన్, భారతీయ జర్నలిస్టులు వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఈ జాయింట్ బ్రీఫింగ్‌లో, ఇద్దరు నేతలు సుంకాలు, 26/11 ముంబై దాడి నిందితుడు తహవుర్ రాణా అప్పగింత, అక్రమ వలసలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సహా పలు కీలక అంశాలపై ప్రసంగించారు. భారత్‌కు ఎఫ్-35 ఫైటర్ జెట్లను అందించేందుకు అమెరికా మార్గం సుగమం చేస్తోందని కూడా ట్రంప్ ప్రకటించారు. తన రెండు రోజుల యుఎస్ పర్యటనలో, ప్రధాని మోదీ యుఎస్ ఇంటెల్ చీఫ్ తులసి గబ్బర్డ్, జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్జ్, బిలియనీర్ ఎలోన్ మస్క్‌లను కూడా కలిశారు. జనవరి 20న ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిసిన నాలుగో ప్రపంచ నాయకుడు ప్రధాని మోదీ.
ఈ పరిణామాల మధ్య “Trump openly insults Modi, yet he keeps laughing… This is why education truly matters. “ అంటూ పోస్టులు పెడుతున్నారు. ట్రంప్ నరేంద్ర మోదీని అవమానిస్తూ మాట్లాడినా, ఆయన నవ్వుతూనే ఉన్నారు. అందుకే విద్య చాలా ముఖ్యం అంటూ పోస్టులు పెట్టారు. వైరల్ వీడియోలో ట్రంప్ మాట్లాడుతా “That’s your question, but I’ll answer it. And yeah, I agree with you, gross incompetence” అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇలా ఆయన మాట్లాడగానే ఇరువురు నేతలతో పాటు సమావేసంలో ఉన్న అందరూ నవ్వారు.
ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించి అని, ఆయనను అవమానిస్తున్నాయనే వాదనతో ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక మోదీ ఆ జోక్‌కి నవ్వుతూ కనిపించారని అంటున్నారు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. భారత ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి ఇబ్బందికర వ్యాఖ్యలు చేయలేదు. జో బిడెన్ ప్రభుత్వం గురించి ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ విజువల్స్ కోసం వెతికినప్పుడు, హిందుస్థాన్ టైమ్స్ “Trump Mocks Biden At Press Briefing With PM Modi: Watch Why | India | USA | White House” అనే టైటిల్‌తో ప్రచురించిన వీడియో దొరికింది. టైటిల్ ను బట్టి, ట్రంప్ జో బైడెన్ పై అలాంటి వ్యాఖ్యలు చేశారని స్పష్టమవుతూ ఉంది. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాతో భారత్‌కు ఉన్న సంబంధాల గురించి ఓ విలేఖరి ప్రధాని మోదీని ప్రశ్నలు అడగడం వీడియోలో ఉంది. "రాబోయే ఈ భాగస్వామ్యం గురించి మీరు సంతోషిస్తున్నారా, గత నాలుగు సంవత్సరాలలో బిడెన్ తో ఎలాంటి భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారు? ఇప్పుడు ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న అధ్యక్షుడు ట్రంప్‌తో మీరు ఎంత ఎక్కువ నమ్మకంతో ఉన్నారో తెలుసుకోవాలని ఉంది" అని విలేఖరి అడిగారు. ఈ ప్రశ్నకు భారత ప్రధాని స్పందించకముందే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమాధానం ఇచ్చారు. అది మీ ప్రశ్న కానీ నేను దానికి సమాధానం ఇస్తాను అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. రెండు
దేశాలు అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయని ట్రంప్ చెప్పారు.
అదే ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ కు సంబంధించిన మరొక వీడియో కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రశ్న, సమాధానం USAలో మునుపటి ప్రభుత్వ పరిపాలన గురించి అని, ప్రధాని మోదీ గురించి కాదని మనం చూడవచ్చు.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సంయుక్త విలేకరుల సమావేశంలో ఒక అమెరికన్ జర్నలిస్ట్ మోదీని ప్రశ్న అడిగారు. అయితే గత ప్రభుత్వ పాలనను ట్రంప్ విమర్శించారు. మోదీ స్పందించకముందే, ట్రంప్ నవ్వుతూ ఆ ప్రశ్నను స్వీకరించారు. గత పాలనపై విమర్శలు గుప్పించారు. యుఎస్ బలహీనమైన నాయకత్వం కారణంగా ప్రపంచం ఎదురుదెబ్బలను చవిచూసిందని ట్రంప్ అన్నారు. అయితే తన పర్యవేక్షణలో పరిస్థితి ఇప్పటికే మెరుగుపడిందని చెప్పారు.
US అధికారిక వెబ్‌సైట్
whitehouse.gov కూడా విలేకరుల సమావేశంలో సంభాషణ ట్రాన్స్క్రిప్ట్ ను పంచుకుంది. గత ప్రభుత్వ పరిపాలన గురించి మాట్లాడుతున్నారని, భారత ప్రధాని గురించి కాదని స్పష్టంగా చూపించే సంభాషణ స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు.
వైరల్ వీడియోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీని ఎగతాళి చేయలేదు. ఆయన అసమర్థుడని వ్యాఖ్యలు చేయలేదు. USAలో జో బిడెన్ పరిపాలన గురించి ట్రంప్ మాట్లాడారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ అవమానించిన తర్వాత కూడా భారత ప్రధాని మోదీ నవ్వుతూ కనిపించారు
Claimed By : Twitter users
Fact Check : Unknown