ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియో దుబాయ్ ఎయిర్ షోలో భారత వైమానిక బృందం చేసిన విన్యాసాలకు సంబంధించింది కాదు
నవంబర్ 2025లో దుబాయ్ ఎయిర్ షోలో భారత వైమానిక దళం చేసిన విన్యాసాలు
నవంబర్ 2025లో దుబాయ్ ఎయిర్ షో సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయింది. ఫైటర్ జెట్ వైమానిక ప్రదర్శనలో పాల్గొంటుండగా ఆ ఫ్లైట్ వేగంగా కూలిపోయింది. దీంతో పైలట్ మరణించాడు. తేజస్ విమానాన్ని భారతదేశానికి చెందిన HAL రూపొందించింది.
భారత వాయుసేనలో వినియోగిస్తున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కూలిపోయిన ప్రమాదంలో పైలట్ మృతి చెందారు. ఈ ఘటనపై భారత వైమానక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పైలట్ కుటుంబానికి సానుభూతి ప్రకటించింది. ఈ ప్రమాదంలో భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ (34) ప్రాణాలు కోల్పోయారు. అతడి స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్‌లోని నగ్రోటా బాగ్వాన్‌లోని పాటియాలాకాడ్ గ్రామం కన్నీటి సంధ్రమైంది. హమీర్‌పూర్ జిల్లాలోని సుజన్‌పూర్ తీరాలోని సైనిక్ స్కూల్‌లో సయాల్ పాఠశాల విద్యను అభ్యసించారు. అతని తండ్రి జగన్ నాథ్, రిటైర్డ్ ఆర్మీ అధికారి, తరువాత హిమాచల్ ప్రదేశ్ విద్యా శాఖలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.
దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ విమానాలు అద్భుతమైన విన్యాసాలు చేశాయంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. దుబాయ్ లో నిర్వహించిన ఎయిర్ షోలో భారత సైన్యం అద్భుతమైన విన్యాసాలు చేసిందంటూ ఈ పోస్టుల్లో చెబుతున్నారు. సముద్రం మీద విమానాలు విన్యాసాలు చేస్తూ ఉండడం ఈ వీడియోల్లో చూడొచ్చు
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియోలకు దుబాయ్ ఎయిర్ షోకు ఎలాంటి సంబంధం లేదు.
భారత వైమానిక దళానికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా దుబాయ్ ఎయిర్ షోలో ఇలాంటి విన్యాసాలను చేసినట్లుగా ఎలాంటి వీడియోలను పోస్టు చేయలేదు.
ఇక వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అయితే ఇవే వీడియోలు కొన్ని నెలల ముందు నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉందని స్పష్టంగా తెలుస్తోంది. 2025లో దుబాయ్ ఎయిర్ షో నవంబర్ 17 నుండి నవంబర్ 21 వరకు జరిగింది.
వైరల్ వీడియోలోని కీలక ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 29 జూన్ 2025 న The Jesolo Air Show Is Popular Event Held Annually In Jesolo, Italy #italia #airshow2025 #yt #1 అనే టైటిల్ తో Mr.Ytubevlog అనే ఛానల్ లో పోస్టు చేశారు. ఇది ఇటలీలోని జెసోలోలో జరిగిన వార్షిక జెసోలో ఎయిర్ షోలో ఏరోబాటిక్స్‌ను చూపించినట్లు పేర్కొంది. ఈ వీడియో 17 నవంబర్ 2025 నుండి 21 నవంబర్ 2025 వరకు జరిగిన దుబాయ్ ఎయిర్‌షో 2025 కంటే ముందు జరిగిందని ఇది నిర్ధారిస్తుంది.
మరింత పరిశోధన చేయగా Stefa Val అనే పేజీలో నిడివి ఎక్కువ ఉన్న వీడియోను అప్లోడ్ చేశారని మేము గుర్తించాం. Frecce Tricolori Jesolo Air Show 2025 అనే టైటిల్ తో 29 జూన్ 2025న వీడియోను అప్లోడ్ చేశారు.
యూరోపియన్ ఎయిర్‌షో కౌన్సిల్ 14 జూలై 2025న ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన ఫోటోను కూడా మేము కనుగొన్నాము. జెసోలో ఎయిర్ షో 28 జూన్ 2025న నిర్వహించారని అందులో తెలిపారు.
ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారో, ఎక్కడ రికార్డు చేశారో మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయాము. కానీ అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా, ఈ వీడియో నవంబర్ 2025లో దుబాయ్ ఎయిర్‌షోలో భారత వైమానిక దళం (IAF) వైమానిక ప్రదర్శన కంటే ముందే ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : నవంబర్ 2025లో దుబాయ్ ఎయిర్ షోలో భారత వైమానిక దళం చేసిన విన్యాసాలు
Claimed By : Social Media Users
Fact Check : Unknown