ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియో దుబాయ్ ఎయిర్ షోలో భారత వైమానిక దళానికి చెందిన తేజస్ విమాన ప్రమాదానికి సంబంధించింది కాదు
దుబాయ్ ఎయిర్ షోలో భారత వైమానిక దళానికి చెందిన తేజస్ విమాన ప్రమాదానికి సంబంధించింది
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానం 'తేజస్' దుబాయ్ ఎయిర్‌షో 2025లో కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో పైలట్ మృతి చెందినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ధృవీకరించింది. విమానం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి, లూప్ తరహా లేదా బారెల్ రోల్ విన్యాసాన్ని ప్రయత్నిస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని ఏవియేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) అభివృద్ధి, కార్యాచరణ చరిత్రలో మంచి భద్రతా రికార్డును కలిగి ఉంది. తేజస్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యుద్ధ విమానం. ఐఏఎఫ్ పాతతరం మిగ్-21 లను భర్తీ చేయడంలో ఈ విమానం కీలక పాత్ర పోషిస్తోంది.
దుబాయ్ ఎయిర్‌షోలో జరిగిన తేజస్ ప్రమాదం విమానం భవిష్యత్తు అవకాశాలను ప్రభావితం చేయదని, దాని బలమైన భద్రతా రికార్డు, స్వదేశీ సాంకేతిక విజయాలను తెలియజేస్తుందని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డికె సునీల్ చెప్పారు. దుబాయ్ ఎయిర్ షో సందర్భంగా జరిగిన తేజస్ విమాన ప్రమాదంలో చనిపోయిన పైలట్‌ను కాంగ్రాకు చెందిన స్క్వాడ్రన్ లీడర్ నమన్ సయాల్‌గా గుర్తించారు. దుబాయ్ వరల్డ్ సెంట్రల్‌లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రేక్షకుల కోసం ఎయిర్ షో ఇస్తుండగా నవంబర్ 21 స్థానిక సమయం మధ్యాహ్నం 2:10 గంటల ప్రాంతంలో తేజస్ జెట్ కూలిపోయింది.
తేజస్ విమాన ప్రమాదాన్ని పలువురు తమ కెమెరాల్లో బంధించారు. అయితే కొన్ని వీడియోలను ఇవి తేజస్ విమాన ప్రమాదానికి సంబంధించినవే అంటూ ప్రచారం చేస్తున్నారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా ఒక విమానం ఆకాశంలో ఎగురుతూ కనిపించగా ఒక్కసారిగా కింద కూలిపోవడం గమనించవచ్చు. క్షణాల్లో ఆకాశం, వాతావరణం అన్నీ మారిపోయినట్లుగా అనిపించగా.. వైరల్ వీడియో రెండు వేర్వేరు క్లిప్‌లను జత చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.
మేము వైరల్ వీడియో నుండి కీలక ఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. 18 నవంబర్ 2025న YouTube ఛానెల్ AIRFORCE.IAF8లో అప్‌లోడ్ చేసిన అదే వీడియో మాకు లభించింది. 21 నవంబర్ 2025న జరిగిన తేజస్ ఫైటర్ జెట్ ప్రమాదం కంటే ముందే ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
Tejas performs sharp turn maneuvers at Dubai air అనే టైటిల్ తో @AIRFORCE.IAF8 పేజీలో అప్లోడ్ చేశారు.
వైరల్ వీడియోలోని మొదటి భాగం నవంబర్ 21 కంటే ముందు నుండి ఆన్ లైన్ లో ఉందని స్పష్టంగా అర్థం అవుతోంది.
ఇక రెండో భాగానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. మాకు విమాన ప్రమాదానికి సంబంధించిన పలు విజువల్స్ లభించాయి.
NBC News తమ యూట్యూబ్ ఛానల్ లో 29 ఆగస్టు 2025న అదే ఫుటేజీని అప్లోడ్ చేసింది. “Video captures the moment an F-16 jet crashes during preparations for an air show in Poland.” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు. దీన్ని బట్టి పోలిష్ ఎయిర్ ఫోర్స్ F-16 విమానం క్రాష్ ల్యాండ్ అయిందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలను వదిలారు.
దాన్ని క్యూగా తీసుకుని గూగుల్ సెర్చ్ చేయగా ఈ ప్రమాదానికి సంబంధించిన పలు వీడియోలను మీడియా సంస్థలు ప్రచురించాయి.
ఆగస్టు 28 సెంట్రల్ పోలాండ్‌లోని రాడోమ్‌లో వైమానిక ప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తుండగా పోలిష్ వైమానిక దళానికి చెందిన F-16 యుద్ధ విమానం కూలిపోయి, పైలట్ మరణించారని పోలండ్ సైన్యం తెలిపింది. రాయిటర్స్ అందుకున్న ఫుటేజ్‌లో F-16 బారెల్ రోల్ ఏరోబాటిక్ విన్యాసాన్ని ప్రదర్శిస్తూ ఉండగా, అది నేలపై కూలి మంటల్లో చిక్కుకుపోయింది. పోజ్నాన్ సమీపంలోని 31వ టాక్టికల్ ఎయిర్ బేస్ నుండి వచ్చిన విమానం ప్రమాదానికి గురైందని మీడియా కథనాలు తెలిపాయి.
ఈ ప్రమాదానికి సంబంధించిన మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
Claim : వైరల్ వీడియో పోలిష్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన F-16 యుద్ధ విమానానికి సంబంధించింది. 2025 దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ విమానం కూలిపోయిన వీడియో కాదు
Claimed By : Social Media Users
Fact Check : Unknown