ఫ్యాక్ట్ చెక్: హిమాచల్ ప్రదేశ్ లోని కులులో వరదలకు సంబంధించిన వీడియో అంటూ చైనాకు చెందిన విజువల్స్ ను వైరల్ చేస్తున్నారు
మనాలి, దాని చుట్టుపక్కల లోయలు ప్రయాణానికి సురక్షితంగా ఉన్నాయని
హిమాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూన్ 20 నుండి రాష్ట్రంలో పలు సంఘటనల కారణంగా మరణించిన వారి సంఖ్య 80 కి పెరిగింది. ఈ మరణాలలో 52 మరణాలు కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, క్లౌడ్ బరస్ట్ వంటి విపత్తులకు ప్రత్యక్షంగా కారణమని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA) తెలిపింది, అయితే 28 మరణాలు రోడ్డు ప్రమాదాలు వంటి ఇతర కారణాల వల్ల సంభవించాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA) తెలిపింది.
జులై 9న స్థానిక వాతావరణ శాఖ ఏడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. చంబా, కాంగ్రా, మండి, కులు, సిమ్లా, సోలన్, సిర్మౌర్ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి ఆకస్మిక వరదలు హిమాచల్ ప్రదేశ్‌లోని పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి. కులు జిల్లా కూడా భారీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమైంది.
ఇంతలో కులు జిల్లాకు సంబంధించిన విజువల్స్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు నుండి వచ్చినట్లు పేర్కొంటూ భారీగా బురద వస్తున్న వీడియో వైరల్ అయింది. ఈ ఫుటేజ్‌లో బురద వల్ల ఇళ్లు, ఆనకట్టలు ధ్వంసమైనట్లు కనిపిస్తోంది.
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇది ఉత్తరప్రదేశ్ కు చెందినది కాదు.
వైరల్ వీడియో లో కొందరు అరవడం విన్నాము, అయితే ఆ భాష అర్థం అవ్వలేదు. దీంతో వైరల్ వీడియో నుండి స్క్రీన్‌షాట్‌లు తీసుకొని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.
వైరల్ వీడియోను న్యూస్ ఫ్లేర్ వెబ్ సైట్ లో అప్లోడ్ చేశారని మేము గుర్తించాం. "Terrifying moment powerful mudslide sweeps village homes into river in China " అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారని మేము గుర్తించాం. ఈ టైటిల్ ను బట్టి ఇది చైనాలో చోటు చేసుకున్న ఘటన అని స్పష్టంగా తెలుస్తోంది.
https://www.newsflare.com/
వైరల్ అవుతున్న వీడియో, ఇందులోని వీడియో ఒకటేనని స్పష్టంగా తెలుస్తోంది. ఒరిజినల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఆ వెబ్‌సైట్ ప్రకారం, “జూలై 4న సాయంత్రం 5:50 గంటల ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా, సిచువాన్ ప్రావిన్స్‌లోని గార్జే టిబెటన్ అటానమస్ ప్రిఫెక్చర్‌లోని డాన్బా కౌంటీలోని షెంజుగౌలోని బాడి టౌన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇళ్ళు, ఆనకట్టలు ధ్వంసమయ్యాయి.
స్థానిక ప్రభుత్వ అధికారుల ప్రకారం, రెండు గ్రామాల ప్రజలు ఈ విపత్తుకు ముందే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని నివేదికలు తెలిపాయి. అధికారులు ముందుగానే స్థానికులను అప్రమత్తం చేయడంతో పెద్ద ఎత్తున ప్రమాదం తప్పింది.
ఇదే వీడియోను పలు చైనా మీడియా సంస్థలు కూడా నివేదించాయి.
https://www.ntdtv.com/b5/2025/
వదంతుల భయాలను తొలగిస్తూ, కులు డిప్యూటీ కమిషనర్ ప్రజలు సోషల్ మీడియా పోస్టులను నమ్మవద్దని కోరారు. జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ సంస్థ నుండి వచ్చే అప్డేట్ల పై ఆధారపడాలని కోరారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పాత వీడియోలు లేదా క్లిప్‌లలో భారీగా నీటితో రోడ్లన్నీ కొట్టుకుపోతున్నట్లు, శిథిలాలు కూలిపోతున్నట్లు చూపిస్తున్నాయి. అలాంటి ఒక వీడియోను కొత్త విపత్తుకు కారణం కాబోతోందని నమ్మి కులు-మనాలీ బెల్ట్‌లో ఆందోళనలకు కారమైందని తెలిపారు. కులు డిప్యూటీ కమిషనర్ తోరుల్ ఎస్.రవీష్ భయాలను తొలగించడానికి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇటీవలి రోజుల్లో ఈ ప్రాంతంలో అసాధారణ వర్షపాతం నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఇటువంటి తప్పుదారి పట్టించే కంటెంట్ వ్యాప్తిని మేము నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
https://www.tribuneindia.com/
ఇలాంటి వీడియోలకు సంబంధించి విశ్వసనీయ వనరుల ద్వారా వాస్తవాలను ధృవీకరించుకోవాలని నివాసితులు, సందర్శకులను అధికారులు కోరారు. జిల్లా పరిపాలనా యంత్రాంగం, హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ అథారిటీ ద్వారా నిజమైన వాతావరణ హెచ్చరికలు పంచుకుంటామని గుర్తు చేశారు. మనాలి, దాని చుట్టుపక్కల లోయలు ప్రయాణానికి సురక్షితంగా ఉన్నాయని డీసీ తెలిపారు. అయితే, కుండపోత వర్షాల సమయంలో నదీ తీరాలు, వాగులు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను నివారించాలని ప్రజలకు సూచించారు. తప్పుడు సమాచారం అనవసరమైన భయాందోళనలను రేకెత్తించడమే కాకుండా పర్యాటక రంగంపై ఆధారపడిన వేలాది కుటుంబాల జీవనోపాధిని కూడా ప్రమాదంలో పడేస్తుందని వెల్లడించారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో హిమాచల్ ప్రదేశ్ కు సంబంధించింది కాదు.