ఫ్యాక్ట్ చెక్: పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం భారతదేశంలో కంటే మెరుగ్గా ఉందని పార్లమెంట్ లో రాహుల్ గాంధీ చెప్పలేదు.
పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం భారతదేశంలో కంటే మెరుగ్గా ఉందని, భారత ప్రజాస్వామ్యాన్ని నరేంద్ర మోదీ నాశనం చేశారని
కేంద్ర సమాచార కమిషన్ (CIC) కు కీలక అధికారుల నియామకంపై చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 10న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో గంటన్నర పాటు సమావేశం నిర్వహించారు. ఇద్దరు నాయకుల మధ్య దాదాపు ఒకటిన్నర గంట పాటు జరిగిన ఈ సమావేశం ప్రధాన సమాచార కమిషనర్, ఎనిమిది మంది సమాచార కమిషనర్లు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC)లో విజిలెన్స్ కమిషనర్ ఎంపికను ఖరారు చేసింది. నిబంధనల ప్రకారం, ప్రధానమంత్రి, ప్రధానమంత్రి ఎంపిక చేసిన కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నాయకుడు సమాచార కమిషన్, ఎన్నికల కమిషన్, విజిలెన్స్ శాఖ ఉన్నతాధికారులను నిర్ణయించాల్సి ఉంది.
సీనియర్ మంత్రి అమిత్ షా కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మధ్యాహ్నం 1 గంటలకు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. సమావేశం మధ్యాహ్నం 1.07 గంటలకు ప్రారంభమైంది. 88 నిమిషాల తర్వాత, రాహుల్ గాంధీ బయటకు వచ్చినప్పుడు, చర్చ కేవలం ప్రధాన సమాచార కమిషనర్ నియామకం గురించి మాత్రమే కాకుండా, ఎనిమిది మంది సమాచార కమిషనర్లు, విజిలెన్స్ కమిషనర్ నియామకం గురించి కూడా జరిగిందని తెలిసింది. అయితే సమావేశం అనంతరం అత్యున్నత పదవులకు ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లతో విభేదిస్తున్నట్లు పేర్కొంటూ.. లిఖితపూర్వక అసమ్మతి నోట్‌ను రాహుల్ గాంధీ అందజేశారు.
మరో వైపు భారతదేశంలో కంటే పాకిస్థాన్ లో మెరుగైన ప్రజాస్వామ్యం ఉందంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
పాకిస్తాన్‌లో భారతదేశం కంటే మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెబుతున్నట్లు వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోను డిజిటల్ గా ఎడిట్ చేశారు.
వైరల్ అవుతున్న వీడియోలోని ఆడియోను నిశితంగా పరిశీలించాం. రాహుల్ గాంధీ ఆడియోలో పాకిస్తాన్ గురించి ప్రస్తావించిన భాగంలో చాలా తేడా కనిపించింది. ఇది వాయిస్ ఓవర్‌ను ట్యాంపర్ చేశారని సూచిస్తోంది.
ప్రస్తుతం, పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి, డిసెంబర్ 1 నుండి 19 వరకు షెడ్యూల్ చేశారు. ఈ సమాచారాన్ని ఉపయోగించి, డిసెంబర్ 9న రాహుల్ గాంధీ మాట్లాడారని మేము గుర్తించాం.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియో లోని స్పీచ్ డిసెంబర్ 9న రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ప్రసంగానికి సంబంధించిందని తేలింది.
"LIVE: Discussion on Election Reforms | Parliament Winter Session | Rahul Gandhi" అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
ఆయన స్పీచ్ లో పాకిస్తాన్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. అంతేకాకుండా పాకిస్తాన్ ప్రజాస్వామ్య వ్యవస్థను భారతదేశం ప్రజా స్వామ్యంతో పోల్చిన వ్యాఖ్యలు కూడా లేవు. రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో ఓట్ చోరీ గురించి ఉన్నాయి. ఎన్నికల కమిషన్, నిఘా సంస్థలు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ వంటి సంస్థలపై పలు ఆరోపణలు చేశారు. ఈసీలను రక్షించడానికి ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఏంటని కేంద్రాన్ని రాహుల్ ప‍్రశ్నించారు. ఎలక్షన్ కమిషనర్‌లకు ఇంత పెద్ద గిప్ట్ ఏ ప్రధాని, హోంమంత్రి ఇవ్వలేదన్నారు. 45 రోజుల్లో సీసీటీవీ పుటేజ్ ధ్వంసం చేసే నిబంధన ఎందుకని రాహుల్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్, హర్యానాలో ఓటు చోరి జరిగిందన్నారు. ఫేక్ ఓట్లపై ఎలక్షన్ కమిషన్ ఇంత వరకూ క్లారిటీ ఇవ్వలేదని తెలిపారు. ఆర్ఎస్ఎస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించేవారిని ప్రభుత్వం టార్టెట్ చేస్తోందని రాహుల్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో ఉంచడానికి ప్రయత్నిస్తుందని రాహుల్ అన్నారు. ఎక్కడ కూడా పాకిస్థాన్ గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించలేదు.
ఇక వైరల్ అవుతున్న క్లిప్పింగ్ లోని వాయిస్ నిజమా? కాదా? అని తెలుసుకోడానికి మేము పలు ఏఐ టూల్స్ ను ఉపయోగించి పరీక్షించి చూశాం.
వీడియో క్లిప్ AI ఉపయోగించి తయారు చేయబడిందో లేదో తెలుసుకోవడానికి మేము డీప్‌వేర్‌ను ఉపయోగించాము. వీడియో క్లిప్‌ను డీప్‌ఫేక్‌గా గుర్తించింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా రాహుల్ గాంధీకి సంబంధించి వైరల్ అవుతున్న ఈ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారని నివేదించాయి. అందుకు సంబంధించిన లింక్స్ ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోలోని వాయిస్ ను డీప్ ఫేక్ ద్వారా సృష్టించారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ పాకిస్థాన్ ప్రజాస్వామ్యంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
Claim : భారత ప్రజాస్వామ్యాన్ని నరేంద్ర మోదీ నాశనం చేశారని, పాకిస్తాన్‌లో భారతదేశం కంటే మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్థ
Claimed By : Social Media Users
Fact Check : Unknown