ఫ్యాక్ట్ చెక్: ఓ మతానికి చెందిన వ్యక్తుల ప్రవర్తన, తీరు అనుమానంగా అనిపిస్తే తమకు ఫిర్యాదు చేయమని NIA ప్రకటన విడుదల చేయలేదు
వ్యక్తుల ప్రవర్తన, తీరు అనుమానంగా అనిపిస్తే తమకు ఫిర్యాదు చేయమని NIA ప్రకటన
నవంబర్ 10న జరిగిన ఢిల్లీ పేలుళ్ల కేసు దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. ఉగ్రవాద దాడిలో పాల్గొన్న మరో నలుగురు ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది. ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరుకుంది. నిందితులను పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనై, అనంతనాగ్‌కు చెందిన డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, షోపియాన్‌కు చెందిన ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగే, లక్నో (ఉత్తరప్రదేశ్) కు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్‌గా NIA గుర్తించింది. "నలుగురు నిందితులను జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పాటియాలా హౌస్ కోర్టులోని జిల్లా సెషన్స్ జడ్జి నుండి ప్రొడ్యూస్ ఆర్డర్‌ల మేరకు NIA అదుపులోకి తీసుకుంది" అని NIA తన ప్రెస్ నోట్‌లో తెలిపింది. అనేక మంది అమాయకులను చంపిన, గాయపరిచిన ఉగ్రవాద దాడిలో వారందరూ కీలక పాత్ర పోషించారని NIA దర్యాప్తులో తేలింది.
అయితే ముస్లింల అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఫోన్ నంబర్‌లను విడుదల చేసిందనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక ముస్లిం వ్యక్తి ఆన్‌లైన్‌లో “సర్ తన్ సే జుడా” అని అంటున్నట్లు కనిపిస్తే, వినియోగదారులు స్క్రీన్‌షాట్ తీసి వాట్సాప్ నంబర్‌కు పంపి NIAని అప్రమత్తం చేయాలని పోస్టుల్లో పేర్కొన్నారు.
*NIA ने जारी किया महत्वपूर्ण नंबर सेव करें...*
मुसलमानों द्वारा कोई भी गलत हरकत जैसे आतंकी साजिश, लवजिहाद, मजार निर्माण, सोशल मीडिया पोस्ट आदि की रिपोर्ट करने के लिए निम्न विशेष फोन नंबर पर तुरंत सूचित करें...
Landline No.: 011-24368800
Mobile No.: 9654447345
WhatsApp No.: 8585931100
Fax No.: 011-24368801
Email Id of NIA : info.nia@gov.in
जो मुसलमान सर तन से जुदा का नारा लगाता दिखाई दे, फेसबुक- ट्विटर और सोशल मीडीया में कहीं भी, सीधा उसका स्क्रीनशॉट लें, लिंक कॉपी करें और वोटसएप नंबर पर भेज दीजिए या काॅल करें....
Please forward this message video....)
इस जानकारी को अपने परिचित लोगों को देकर आप भी नैतिक दायित्व का पालन अवश्य करें...
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న వాదనను ధృవీకరించడానికి, సంబంధిత పదాలను ఉపయోగించి గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేసాము, కానీ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అనుమానిత ముస్లింలకు సంబంధించిన వివరాలను తెలియజేయాలంటూ ప్రజలను కోరినట్లుగా ఎలాంటి పత్రికా ప్రకటన మాకు కనిపించలేదు.
తరువాత మేము NIA అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాము. వైరల్ పోస్ట్‌లో పేర్కొన్న నంబర్‌లలో ఏజెన్సీ ఢిల్లీ ప్రధాన కార్యాలయం నిజమైన కంట్రోల్-రూమ్ నంబర్‌లుగా ఉన్నాయని కనుగొన్నాము. అయితే, ఈ నంబర్‌లు వైరల్ పోస్ట్‌లో చెప్పిన దానికి జారీ చేయలేదు.
జాతీయ దర్యాప్తు సంస్థ అటువంటి ప్రకటన ఏదీ చేయలేదని ఆ సంస్థ సోషల్ మీడియా ఖాతాలు, అధికారిక వెబ్ సైట్లను పరిశీలించాక తెలిసింది. ముఖ్యంగా అటువంటి ప్రకటన జాతీయ దర్యాప్తు సంస్థ చేసి ఉండి ఉంటే మీడియా, సోషల్ మీడియాలో కీలకమైన టాపిక్ గా మారి ఉండేది. కాబట్టి అలాంటిదేమీ నిజం కాదు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి దర్యాప్తు కోసం NIA చివరిసారిగా మే 2025లో కాంటాక్ట్ నంబర్‌ను విడుదల చేసింది. పర్యాటకులు, సందర్శకులు, స్థానికులు పహల్గామ్ దాడికి సంబంధించిన ఏవైనా ఫోటోలు, వీడియోలు లేదా సమాచారాన్ని పంచుకోవాలని కోరింది.
గతంలో కూడా ఇలాంటి వాదన వైరల్ అయింది. PIB ఫ్యాక్ట్ చెక్ 23 జూన్ 2023న వైరల్ పోస్ట్ ప్రజలను తప్పుదారి పట్టించేదని స్పష్టం చేసింది. ఈ నంబర్లు NIAకి చెందినవి అయినప్పటికీ, ముస్లింలను లేదా ఇతర ప్రజలకు సంబంధించిన వివరాలను కోరుతూ ఏజెన్సీ ఎటువంటి అడ్వైజరీ జారీ చేయలేదని PIB పేర్కొంది.
NIA కూడా గతంలో ఇలాంటి వైరల్ పోస్టులను ఖండిస్తూ వివరణ ఇచ్చింది. జూలై 2022లో ప్రెస్ నోట్ ద్వారా వివరణ ఇచ్చింది. ఆ ప్రెస్ నోట్‌లో, ఏజెన్సీ అలాంటి హెల్ప్‌లైన్‌ను ప్రారంభించలేదని, ముస్లింలను టార్గెట్ చేసే సందేశాలు పూర్తిగా నకిలీవి, దురుద్దేశంతో కూడినవని పేర్కొంది. 2021లో, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను 011-24368800 నంబర్‌కు నివేదించాలని NIA ప్రజలకు విజ్ఞప్తి చేసింది, కానీ ముస్లిం సమాజం గురించి ఎటువంటి ప్రస్తావన లేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.