ఫ్యాక్ట్ చెక్: బీజేపీ నేత నవ్య హరిదాస్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబ సభ్యులను ఎన్నికల్లో ఓడించలేదు
బీజేపీ నేత నవ్య హరిదాస్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబ సభ్యులను
గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో తొలి లోక్‌సభ స్థానాన్ని కేరళలో గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. ఇక తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ను కూడా కైవసం చేసుకుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) కేరళ స్థానిక సంస్థల ఎన్నికలలో అలప్పుజ జిల్లాలో కూడా మంచి మెరుగుదలను నమోదు చేసింది. 2020లో బీజేపీ వార్డుల సంఖ్య 181 ఉండగా ప్రస్తుతం 240కి పెరిగింది. పున్నప్రా, నీలంపెరూర్ వంటి ప్రాంతాల్లో కూడా మంచి విజయాలను నమోదు చేసింది. 240 వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 235 స్థానాలను గెలుచుకుంది. పార్టీ మద్దతు ఉన్న స్వతంత్రులతో సహా ఆ పార్టీ మిత్రపక్షం భారత్ ధర్మ జన సేన (BDJS) ఐదు స్థానాలను గెలుచుకుంది. బుధనూర్ (ఏడు సీట్లు), కార్తీకప్పల్లి (ఆరు), నీలంపేరూర్ (ఏడు) తిరువాన్వండూర్ (ఐదు) గ్రామ పంచాయతీలలో NDA ఏకైక అతిపెద్ద కూటమిగా అవతరించింది.
స్థానిక సంస్థల ఎన్నికలలో NDA ఓట్ల వాటా దాదాపు 16 శాతంగా ఉంది. ఇది 2024 లోక్‌సభ ఎన్నికలలో వచ్చిన 15.64 శాతం వాటాకు దగ్గరగా ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికలలో, NDA ఓట్ల వాటా 12.41 శాతంగా ఉంది.
అయితే బీజేపీ నేత నవ్య హరిదాస్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబ సభ్యులను ఓడించిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. కేరళ లోకల్ బాడీ ఎలెక్షన్స్ లో నవ్య హరిదాస్ పినరయి విజయన్ మేనల్లుడిని ఓడించిందనే వాదనతో పోస్టులు పెట్టారు.
"శబరిమల కుట్రలు చేస్తున్న కేరళ CM పినరై గాడి కుటుంబాన్ని కుప్ప కూలుస్తా అని సబధం చేసిన నవ్య హరిదాస్ చెప్పినట్టుగా పినరై మేనల్లుడిని చిత్తుగా ఓడించి కాషాయ దెబ్బేంటో చూపించింది
#BJP4ViksitBharat
#kerala #Sabarimala" అంటూ పలు పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. బీజేపీ నేత నవ్య హరిదాస్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబ సభ్యులను ఏ ఎన్నికల్లోనూ ఓడించలేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే వైరల్ అవుతున్న వాదనకు మద్దతుగా మాకు ఎలాంటి కథనాలు కూడా లభించలేదు. నిజంగా బీజేపీ నేత నవ్య హరిదాస్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబ సభ్యులను ఓడించి ఉంటే అది తప్పనిసరిగా వార్తల్లో ప్రధానంగా వచ్చి ఉండేది. అలాంటి వార్తలేవీ మాకు లభించలేదు.
కేరళ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నవ్య హరిదాస్ కోజికోడ్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు నంబర్ 70, కరప్పరంబ్ నుండి విజయం సాధించారు.
https://www.indiatvnews.com/
ఇక కేరళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఉన్న అభ్యర్థుల జాబితాను పరిశీలించగా, నవ్య హరిదాస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన షీజా కనకన్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి చెందిన హషితా టీచర్ పై విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. ఈ వార్డు నుంచి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కుటుంబానికి చెందిన అల్లుడు గానీ, మేనల్లుడు గానీ, ఇతర బంధువులు గానీ ఎవరూ పోటీ చేయలేదు.
నవ్య హరిదాస్ ఫేస్ బుక్ ప్రొఫైల్ ను మేము పరిశీలించాం. అందులో "రాజకీయ ప్రత్యర్థులు.. LDF అభ్యర్థి హషిత టీచర్‌తో, UDF అభ్యర్థి షీజా కనకన్‌తో.." అంటూ పోస్టు పెట్టారు.
ఏ మీడియా సంస్థ కానీ, నవ్య హరిదాస్ కానీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబ సభ్యులను ఓడించినట్లుగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.