ఫ్యాక్ట్ చెక్: ఇండిగో సంక్షోభం సమయంలో గోవా ఎయిర్ పోర్టులో ప్రజలు డ్యాన్స్ చేయలేదు. పాత వీడియో మళ్లీ వైరల్ అవుతోంది
ఇండిగో సంక్షోభం సమయంలో గోవా ఎయిర్ పోర్టులో ప్రజలు డ్యాన్స్
ఇండిగోలో సంక్షోభం గత కొన్ని రోజులుగా కొనసాగుతూ ఉంది. వేలాది విమానాలు రద్దు అవ్వడంతో ప్రయాణీకులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ఎయిర్‌లైన్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని హామీ ఇచ్చినప్పటికీ, ఎయిర్‌లైన్స్ డిసెంబర్ 10న దాదాపు 220 విమానాలను రద్దు చేసింది. ఇండిగోలో గందరగోళం డిసెంబర్ 2న ప్రారంభమైంది. సిబ్బంది కొరత, కొత్త సిబ్బంది నిబంధనల కారణంగా ఇండిగో కార్యాచరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇండిగో నిర్వహణ, పైలట్ల లభ్యత సమస్యలు, టెక్నికల్ తనిఖీలు వంటి అంశాలను పరిశీలించేందుకు డీజీసీఏ ప్రత్యేక బృందాలను నియమించింది. విమానయాన శాఖ ఇండిగో మొత్తం ఆపరేషన్లలో 10 శాతాన్ని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇండిగో సుమారు 200 విమాన సర్వీసులు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం ఆదేశించింది.
11-12-2025న కూడా గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రద్దు కొనసాగింది. డిసెంబర్ 11, 2025న రద్దు చేసిన ఇండిగో విమానాల జాబితాను గోవా అంతర్జాతీయ విమానాశ్రయం విడుదల చేసింది. గోవా అంతర్జాతీయ విమానాశ్రయం, దబోలిమ్‌లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, దీని వలన ఏడు ఇండిగో విమానాలు రద్దు చేశారు. ఇది ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలకు ప్రయాణించే వారిపై ప్రభావం చూపింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్‌లకు వెళ్లాల్సిన విమానాలు రద్దు చేశారు. ఈ గందరగోళం మధ్య అనేక మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఎంపికల కోసం వెతుకుతున్నారు. అంతరాయాలు కొనసాగినప్పటికీ, గత కొన్ని రోజులతో పోలిస్తే స్పష్టమైన మెరుగుదల ఉందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
ఇండిగో విమానం రద్దవ్వడంతో గోవా ఎయిర్ పోర్టులో ప్రయాణీకులు ఇటీవల గర్బా నృత్యం చేశారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆర్కైవ్ చేసిన లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
https://www.instagram.com/
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. కొంతమంది నృత్యం చేస్తున్నట్లు చూపించే వీడియోను యూజర్లు షేర్ చేశారు. విమానం ఆలస్యం అయిన తర్వాత ప్రయాణీకులు గోవా విమానాశ్రయంలో గర్బా ప్రదర్శించారని, ఇటీవలి కాలంలో ఇండిగో విమానాల రద్దు సమయంలో చోటు చేసుకుందని ఆరోపించారు.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ఇటీవలి వీడియో కాదు.
వైరల్ వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ‘heraldo_goa’ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ చేసిన పోస్ట్ మాకు కనిపించింది. సోషల్ మీడియా పోస్ట్‌లో చూసిన వీడియో ఈ అకౌంట్ లో పోస్టు చేశారు.
అయితే ఇది ఇటీవలి ఇండిగో సంక్షోభానికి సంబంధించింది కాదు. సెప్టెంబర్ 30న ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. గోవా నుండి సూరత్‌కు వెళ్లే విమానం ఐదు గంటలు ఆలస్యం కావడంతో, గోవా విమానాశ్రయంలోని ప్రయాణీకులు, ఎయిర్‌లైన్ సిబ్బంది కలిసి గర్బా ప్రదర్శించారు.
“గోవా నుండి సూరత్‌కు వెళ్లే విమానం ఐదు గంటలు ఆలస్యం అయిన తర్వాత, గోవా విమానాశ్రయంలోని ప్రయాణీకులు, ఎయిర్‌లైన్ సిబ్బంది కలిసి గర్బా ప్రదర్శన చేశారు. దీంతో వెయిటింగ్ సమయంలో అందరూ ఎంజాయ్ చేశారు. ఒకరు స్పీకర్లను ఏర్పాటు చేసి అందరినీ డ్యాన్స్ చేసేలా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది” అని ఆ పోస్టు వివరణలో తెలిపారు.
దీన్ని క్యూగా తీసుకుని సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా పలు మీడియా సంస్థల నివేదికలు మాకు లభించాయి.
"A flight delay at Goa airport turned into a joyous celebration as passengers spontaneously broke into Garba, filling the terminal with dance, music, and festive cheer." అంటూ టైమ్స్ నౌ అక్టోబర్ 1న వీడియోను పోస్టు చేసింది.
సెప్టెంబర్ 30, 2025న NDTV కథనాన్ని ప్రచురించింది. "Passengers Perform Garba At Goa Airport After Flight Delay, Airline Staff Joins" అనే టైటిల్ తో కథనం ఇక్కడ చూడొచ్చు.
సూరత్ వెళ్లే విమానం సాయంత్రం 5 గంటలకు గోవా నుండి బయలుదేరాల్సి ఉంది. ప్రయాణీకులు సూరత్ వెళ్లి నవరాత్రి ఉత్సవాల్లో, గర్బాలో పాల్గొనాలని ఎదురు చూస్తున్నారు. కానీ సాంకేతిక సమస్య కారణంగా విమానం ఆలస్యం అయింది. అయితే ఆ సమయంలో ప్రయాణీకుల విజ్ఞప్తి మేరకు స్పీకర్లను ఏర్పాటు చేశారు, గర్బా కోసం అందరూ ఒకచోట చేరారు. విమాన సిబ్బందితో సహా ప్రయాణీకులు కూడా నృత్యం చేశారు. ఈ వీడియో వైరల్ అయిందని మీడియా సంస్థలు తెలిపాయి.
ఇండిగోలో సంక్షోభం కారణంగా విమానాలు డిసెంబర్ 2025లో రద్దు అవ్వగా, వైరల్ వీడియో సెప్టెంబర్ 30, 2025 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.