ఫ్యాక్ట్ చెక్: లైంగిక సంబంధం లేకుండానే పిల్లలకు జన్మనివ్వొచ్చని జగద్గురు రాంభద్రచార్య పేర్కొనలేదు
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. జగద్గురు రాంభద్రాచార్యను
జగద్గురు రాంభద్రాచార్య వీడియో ఒకటి వైరల్ కావడంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఆయన WIFE అనే పదానికి అసాధారణమైన నిర్వచనం ఇచ్చారు. ఇది చాలా మంది మహిళలను కించపరిచేదిగా భావించారు. భార్యను "ఆనంద సాధనం"గా అభివర్ణించిన ఆయన ప్రకటన విస్తృత వ్యతిరేకతకు దారితీసింది.
వీడియోలో, రాంభద్రాచార్య WIFEని W = వండర్ ఫుల్, I = ఇన్స్ట్రుమెంట్ , F = ఫర్ , E =ఎంజాయ్ అని చెప్పారు. భార్యను ఒక ఆనంద సాధనం అనే అర్థం చెప్పారాయన. వివాహితలు మాత్రమే ఈ "నిజమైన" అర్థాన్ని అర్థం చేసుకోగలరని, పెళ్లికాని వ్యక్తులు, సన్యాసులు దీనిపై వ్యాఖ్యానించకూడదని అన్నారు. ఈ వీడియో మొదట రాంభద్రాచార్య యూట్యూబ్ ఛానెల్‌లో 25 జూలై 2025న అప్‌లోడ్ చేశారు. WIFE అనే పదాన్ని, పత్ని అనే పదం రెండింటినీ ఆయన వివరించినప్పటికీ, ఇంగ్లీష్ లో చెప్పిన "WIFE" భాగం మాత్రమే వైరల్ అయ్యింది. ఆన్‌లైన్‌లో విస్తృతంగా ట్రోలింగ్ కు గురైంది.
ఈ వివాదంపై ఆర్జేడీ అధికార ప్రతినిధి కాంచన్ యాదవ్ స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. అలాంటి ప్రకటనలు మహిళలను అవమానించడమేనని అన్నారు.
www.bhaskarenglish.in/amp/local/bihar/news/rambhadracharya-controversy-grows-after-viral-wife-remark-critics-condemn-statement-as-derogatory-towards-women-136548337.html
ఈ నేపథ్యంలో, జగద్గురు రాంభద్రాచార్యుల వ్యాఖ్యలకు సంబంధించిన పోస్ట్‌కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్ట్‌కార్డ్‌లో రాంభద్రాచార్యులు చేసినట్లుగా వివాదాస్పద ప్రకటనలు ఉన్నాయి. “మేము బ్రాహ్మణులం. లైంగిక సంపర్కం లేకుండానే గర్భం దాల్చే శక్తి మాకు ఉంది. వివాహం తర్వాత, తంత్రాలు, మంత్రాలు, సిద్ధిల ద్వారా లైంగిక సంపర్కం లేకుండానే గర్భం దాల్చేలా చేయవచ్చు.” అంటూ పోస్టులు వైరల్ అయ్యాయి.
Navbharat Times (NBT) మీడియా సంస్థ లోగో వైరల్ గ్రాఫిక్ కార్డు మీద ఉండడంతో నిజమని నమ్మేసి చాలా మంది పోస్టులను షేర్ చేస్తున్నారు.
ఆర్కైవ్ క్లెయిమ్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. జగద్గురు రాంభద్రాచార్యను ఉటంకిస్తూ వచ్చిన నవభారత్ టైమ్స్ పోస్ట్‌కార్డ్ నకిలీది.
జగద్గురు రాంభద్రాచార్య నిజంగా అలాంటి ప్రకటన చేశారో లేదో తనిఖీ చేయడానికి మేము సంబంధిత కీ వర్డ్స్ ను ఉపయోగించి శోధించాము. అయితే, ఈ వాదనకు మద్దతు ఇచ్చే విశ్వసనీయ నివేదికలు లేదా విశ్వసనీయ వనరులు మాకు దొరకలేదు. ఆయన నిజంగా అలాంటి వివాదాస్పద వ్యాఖ్య చేసి ఉంటే, దానిని మీడియా దృష్టిని ఆకర్షించి ఉండేది. కానీ అలాంటి ప్రకటన ఏదీ మాకు లభించలేదు.
వైరల్ పోస్టుకు సంబంధించి మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాము. NBT కి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో 9 డిసెంబర్ 2025 నాటి ఇలాంటి పోస్ట్‌కార్డ్‌ను కనుగొన్నాము. జగద్గురు రాంభద్రాచార్య ఫోటోగ్రాఫ్ రంగు, డిజైన్ వైరల్ పోస్ట్‌కార్డ్‌తో సరిగ్గా సరిపోలుతుంది. అయితే, అసలు పోస్ట్‌లో ప్రకటన పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
నిజమైన NBT పోస్ట్‌కార్డ్‌లో, రాంభద్రాచార్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విమర్శిస్తున్నట్లు ఉంది. ఆమెను ఇకపై తన సోదరిగా పేర్కొనలేనని అన్నారు.
అసలు పోస్ట్‌కార్డ్, వైరల్ అయిన పోస్ట్‌కార్డ్ ను చూడగా వైరల్ ఇమేజ్‌ను ఎడిట్ చేసినట్లుగా స్పష్టంగా చూపిస్తుంది. అసలు టెక్స్ట్‌ను తొలగించి, తప్పుడు, కల్పిత ప్రకటనతో భర్తీ చేశారు. దీన్ని బట్టి వైరల్ పోస్ట్‌కార్డ్‌ను ఎడిట్ చేశారని తెలుస్తుంది.
తంత్రం, మంత్రాల ద్వారా బ్రాహ్మణులు లైంగిక సంబంధం లేకుండానే పిల్లలకు జన్మనివ్వొచ్చని జగద్గురు రాంభద్రచార్య పేర్కొన్న వైరల్ పోస్ట్‌కార్డ్ నకిలీదని డిసెంబర్ 12, 2025న నవభారత్ టైమ్స్ (NBT) వివరణ ఇచ్చిందని కూడా మేము కనుగొన్నాము.
విశ్వాస్ న్యూస్ తో సహా అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఇప్పటికే ఈ వాదనను తోసిపుచ్చాయి. ఇది పూర్తిగా నకిలీవని నివేదించాయి.
అందువల్ల, వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదని మేము కనుగొన్నాము. నవభారత్ టైమ్స్ పోస్ట్‌కార్డ్ ను ఎడిట్ చేసి జగద్గురు రాంభద్రాచార్యకు తప్పుగా ఆపాదించారని తేలింది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదన పూర్తిగా కల్పితం. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు.
Claim : ఈ ప్రకటనను జగద్గురు రాంభద్రాచార్యకు ఆపాదిస్తూ నవభారత్ టైమ్స్ కథనాన్ని ప్రచురించలేదు
Claimed By : Social Media Users
Fact Check : Unknown