Tirumala : ఆదివారం తిరుమలకు వస్తున్నారా?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రాను రాను ఎక్కువగా కనిపిస్తుంది. తిరుమలకు వచ్చే భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు నెలలతో సంబంధం లేకుండా.. వారాలతో పని లేకుండా ఎప్పుడంటే అప్పుడు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. స్వామి వారిని దర్శించుకుంటే తమ కష్టాలు తీరతాయని భావించి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
కాలినడకన వచ్చే వారి సంఖ్య...
తిరుమలకు వచ్చే భక్తులు అనేక మార్గాలతో వస్తున్నారు. కాలినడకన వచ్చే వారి సంఖ్య కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా మారింది. తిరుమలకు కాలి నడకన వస్తే తమ కష్టాలన్నీ తీరతాయని భక్తులు విశ్విసిస్తారు. అందుకోసం కాలి నడకన వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దర్శనం కోసం సులువుగా అయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనంతో పాటు శ్రీవాణి దర్శనం టిక్కెట్లతోనూ, ఎస్.ఎస్.డి టోకెన్లతోనూ స్వామి వారిని దర్శించుకునే వారు ఎక్కువగా ఉన్నారు.
పదకొండు కంపార్ట్ మెంట్లలో....
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదకొండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76, 935 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,770 మంది భక్తులు తమ తలనీలలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.20 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.