Tiruamla : సెలవుల రోజు తిరుమలకు వెళ్లే వారికి అలెర్ట్

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది.

Update: 2026-01-26 03:16 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా సెలవు దినం కావడంతో పాటు వరసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. నిన్న తిరుమలలో రథసప్తమి వేడుకలకు అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అదే రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. నిన్న అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాలను తనిఖీ చేసుకోవాలంటే ఎక్కువ సమయం పట్టిందని భక్తులు చెబుతున్నారు. ఈ రద్దీ మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

వరస సెలవులతో...
తిరుమలకు ఇటీవల కాలంలో భక్తుల ఎక్కువ సంఖ్యలో రావడం సాధారణంగా మారింది. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు అప్పటికప్పుడు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా ఇటీవల కాలంలో పెరిగింది. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు సంక్రాంతి సెలవులు కూడా పూర్తి కావడంతో భక్తుల తిరుమల శ్రీనివాసుడి వద్ద మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. భక్తులు అత్యధిక సంఖ్యలో తరలి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
గోగర్భం డ్యాం వరకూ ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. బయల గోగర్భం డ్యాం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. అంటే అక్టోపస్ బిల్డింగ్ వరకూ భక్తుల క్యూ లైన్ ఉంది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులు ఆరు గంటలు, మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటలకుపైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 84,014 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,131 మంది తమ తలనీలాలను సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.69 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News