Tirumala : తిరుమలకు నేడు వెళ్లే వారు గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిందేనా?

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది

Update: 2025-12-18 03:14 GMT

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. గత రెండు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. అయితే గురువారం మాత్రం భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు సులువుగా స్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా, అన్ని రకాలుగా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఘాట్ రోడ్డులో ప్రయాణం...
మరొకవైపు చలి ఎక్కువగా ఉండటం, పొగమంచు దట్టంగా అలుముకుంటుండటంతో ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. నిర్దేశించిన వేగంతోనే లైట్లు వేసుకుని సొంత వాహనాల్లో వచ్చే వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రమాదాలు జరిగే సమయం ఉదయం వేళ తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. మరొకవైపు నేడు తిరుమలలో వసతి గృహాల దొరకడానికి కూడా భక్తుల చాలా సేపు వేచి ఉండాల్సి వస్తుంది.
ఇరవై ఏడు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఏడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 66,389 మంది దర్శించుకున్నారు. వీరిలో 24,956 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.81 వచ్చిందని అధికారుల వెల్లడించారు.





Tags:    

Similar News