Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా.. అయితే మీకొక గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు శనివారం కావడంతో భక్తుల రద్దీ ఒకింత ఎక్కువగానే ఉంది. కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. తిరుమలలో సాధారణ రోజుల్లోనే చలితీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు పరిస్థితిని గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. తిరుమలకు వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరుతున్నారు.
ఘాట్ రోడ్డులో ప్రయాణం...
ముఖ్యంగా చలిగాలుల తీవ్రతతో పాటు ఘాట్ రోడ్డులో ప్రయాణం కూడా ప్రమాదకరంగా ఉంటుంది. ఎక్కే సమయంలోనూ, కొండ దిగే సమయంలోనూ జాగ్రత్తగా ఉండాలని, పొగమంచు లేని సమయంలోనే ప్రయాణం సాగించడం ఉత్తమమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా మార్జిన్స్ కనపడక ప్రమాదాలకు గురయ్యే అవకాశముందని, ముఖ్యంగా సొంత వాహనాలలో తిరుమలకు వచ్చే ప్రయాణికులు లైట్లు వేసుకుని తగిన జాగ్రత్తలతో నిదానంగా కొండకు చేరుకోవాలని కోరుతున్నారు.
హుండీ ఆదాయం మాత్రం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఇరవై ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,202 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,864 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.04 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.