Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. ఎంత వరకూ క్యూ లైన్ అంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగానే ఉంటుంది. సాధారణంగా శుక్రవారం నుంచి రద్దీ మొదలయి సోమవారం వరకూ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమలకు వచ్చే వారి సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. స్వామి వారి హుండీ ఆదాయం కూడా గతంలో కంటే గణనీయంగా పెరిగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు. అదే సమయంలో శ్రీవారి సేవకుల సేవలను ఉపయోగించుకుని భక్తులకు సౌకర్యాలను అందించడంలో అండగా ఉంటున్నారు.
ధనుర్మాసం ప్రారంభం కానుండటంతో...
మరొకవైపు ఈ నెల 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం ఉంది. డిసెంబరు 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజు మధ్యాహ్నం 1.23 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. డిసెంబరు నుంచి జనవరి నెలాఖరు వరకూ సిఫార్సు లేఖను అనుమతించే అవకాశం ఉండదు.
బయట వరకూ క్యూ లైన్...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్ నిండిపోయింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 80,113 మంది దర్శించుకున్నారు. వీరిలో 31,683 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.71 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.