చిరంజీవిని లాజిక్ తో కొడుతున్న వైసీపీ నేతలు

నటీనటుల రెమ్యూనరేషన్‌పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయని ప్రశ్నించారు. డిమాండ్, ఆదరణ ఉన్నప్పుడు నటీనటులకు

Update: 2023-08-08 14:36 GMT

మెగా స్టార్ చిరంజీవి తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మంలో నటీనటుల రెమ్యూనరేషన్ విషయంపై స్పందిస్తూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. నటీనటుల రెమ్యూనరేషన్‌పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయని ప్రశ్నించారు. డిమాండ్, ఆదరణ ఉన్నప్పుడు నటీనటులకు రెమ్యూనరేషన్లు ఎక్కువే ఉంటాయనీ, ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రభుత్వాలను గుండెల్లో పెట్టుకుంటారన్నారు. చిత్ర పరిశ్రమ గురించి కాదని.. ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు గురించి మాట్లాడాలని అన్నారు. అలాగే, పేదవారికి కడుపు నిండే పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి పెద్ద పెద్ద వాటి గురించి ఆలోచించాలనీ, ఆ విధంగా ప్రయత్నాలు సాగాలన్నారు.

దీనిపై వైసీపీ నాయ‌కుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్య‌నారాయ‌ణ స్పందిస్తూ.. సినీ ప‌రిశ్ర‌మ‌ను పిచ్చుక అని చిరంజీవి ఒప్పుకుంటున్నారా? అంటూ కౌంట‌రించ్చారు. ఆయ‌న ఏ ఉద్దేశంతో అన్నారో తెలియ‌దు కానీ ప్ర‌భుత్వం త‌నప‌ని తాను చేసుకుంటోంద‌ని అన్నారు. చిరంజీవి చేసిన వ్యాఖ్య‌ల‌ను తాను చూడ‌లేద‌నీ, చూసిన త‌ర్వాత మ‌రోసారి స్పందిస్తాన‌ని బొత్స అన్నారు.
మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ.. తాను వ్యక్తిగతంగా చిరంజీవికి అభిమానినని, చదువుకునే రోజుల్లో దండలు వేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. చిరు పారితోషికం గురించి తాము మాట్లాడలేదన్నారు. సినిమాను సినిమాలాగే చూడాలని, రాజకీయాన్ని రాజకీయంలాగే చూడాలని పేర్ని నాని సూచించారు. ఇతర హీరోలపై తాము ఎప్పుడూ మాట్లాడలేదని, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడిందా? అని ప్రశ్నించారు. సినిమావాళ్లు అందరూ వేరు.. పవన్ కళ్యాణ్ వేరు అని వ్యాఖ్యానించారు. సినిమాల్లో హీరో విలన్ని కొడుతుంటే చూస్తూ కూర్చున్నట్లు రాజకీయాల్లో కూర్చోరని, రాజకీయాల్లో ఒకరు గోకితే ఎదుటివారు కూడా గోకుతారని అన్నారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. రాష్ట్ర విభజన సమయంలో చిరు ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. తమపై దాడి చేస్తే ఎదురుదాడి తప్పదని హెచ్చరించారు.
వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ స్పందిస్తూ.. చిరంజీవి గారు తొలుత మొదలు పెట్టిందే మీ తమ్ముడని ట్వీట్ చేశారు. బురద రాజకీయాలు చేయవద్దని మీ తమ్ముడికి చెప్పాలని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని పవన్ కు చెప్పాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఎలా తీసుకురావాలో మేం చూసుకుంటామని చెప్పారు.
చిరంజీవి మొదట తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు జ్ఞానబోధ చేయాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ హితవు పలికారు. చిరంజీవి అంటే తనకు గౌరవం ఉందని అన్నారు. ఆయన సినిమాలను రాజకీయాల్లోకి లాగవద్దని మాట్లాడినట్లుగా తెలిసిందని, కానీ అలా మొదట చేసింది ఎవరో తెలుసుకోవాలన్నారు. సినిమాలను రాజకీయాల్లోకి తెచ్చింది జనసేన అధినేత అని అన్నారు. మళ్లీ దాడికి ప్రతిదాడి చేస్తే బాధపడుతున్నారన్నారు. బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు పాత్రను సృష్టించింది ఎవరు? అని అడిగారు. ఆ పాత్ర అంబటిదేనని చెప్పే ధైర్యం కూడా వారికి లేదన్నారు. అసలు బ్రో సినిమాలో క్యారెక్టర్ పెట్టారో లేదో చెప్పగలరా? అన్నారు. తొలుత తమ్ముడికి జ్ఞానబోధ చేసి, ఆ తర్వాత రాజకీయ నాయకులకు సూచనలు చేయవచ్చునని చిరంజీవికి సూచించారు. ఏది పడితే అది మాట్లాడటం సరికాదన్నారు.


Tags:    

Similar News