Tirumala : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. హుండీ ఆదాయం అత్యంత తక్కువ
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది. నిన్నమొన్నటి వరకూ భక్తుల రద్దీతో కిటకిటలాడిన తిరుమల నిన్నటి నుంచి కొంత భక్తుల రద్దీ తక్కువగాకనిపిస్తుంది.భక్తుల తగ్గడంతో ఆ ప్రభావం హుండీ కానుకలపై కూడా పడింది. ఇటీవల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం అత్యంత తక్కువగా నిన్న మాత్రమే వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఎప్పుడూ ఇంత తక్కువ స్థాయిలో హుండీ ఆదాయం రాలేదని, మళ్లీ శుక్రవారం నుంచి రద్దీ పెరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
ఎండల ఎఫెక్ట్...
ఒకవైపు పరీక్షలు జరుగుతుండటం, ఎండలు తీవ్రం కావడంతో ఎక్కువ మంది తిరుమలకు చేరుకోలేకపోతున్నారు. దీంతో పాటు వేసవిలోరద్దీ ఎక్కువగా ఉంటుందని కొందరు తిరుమలకు వచ్చే కార్యక్రమాన్నివాయిదా వేసుకుంటున్నారు. అయితే పరీక్షలు పూర్తయి, ఫలితాలు వెలువడిన తర్వాత తిరిగి భక్తుల రద్దీ పెరుగుతుందని, అలాగే శుక్రవారం నుంచి సోమవారం వరకూ భక్తుల రద్దీ ఉంటుందని భావిస్తున్నారు. ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్నభక్తులు తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఆరు గంటల్లోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,772 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,013 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 1.47 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.