Congress : షర్మిలకు సహకరించని సీనియర్లు.. అసలు రీజన్ ఇదే
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిలకు సీనియర్ నేతలు సహకరించే పరిస్థితులు కనిపించడం లేదు
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిలకు సీనియర్ నేతలు సహకరించే పరిస్థితులు కనిపించడం లేదు. ఒక రకంగా వారంతా వైఎస్ షర్మిలను దూరంగా పెట్టినట్లు కనపడుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా పీసీసీ చీఫ్ బాధ్యతలను చేపట్టిన తర్వాత కనీసం సీనియర్ నేతలు ఆమెకు సహకరించకపోగా, తమకు పట్టనట్లు కూర్చోవడం ఆమె నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేదని వారు భావిస్తున్నట్లుంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పదేళ్ల పాటు పదవులు పొందిన వారు తర్వాత కనుచూపు మేరలో కనిపించడం లేదు. కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదు. సీనియర్ నేతలంతా దాదాపు రాజకీయ పదవీ విరమణ చేసినట్లే ఫీలవుతున్నారు. అందుకే బయటకు రావడం లేదు.
ఇప్పటి రాజకీయాలను...
పార్టీ బలం గా ఉన్నపుడు ముందుకు వచ్చి పదవులు దక్కించుకోవడం నాయకత్వం కాదు.కష్ట కాలం లో క్యాడర్ తో నిలబడటం, ప్రజల్లో విశ్వాసం నింపటం..అదే అసలు నాయకత్వమని తెలిసినా వారు మౌనంగా ఉంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పడిపోయిన తరువాత చాలా మంది సీనియర్లు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీ లకు వెళ్లారు. వారితో పాటు క్యాడర్ కూడా జగన్ పార్టీకి చేరువయింది. కానీ సీనియర్ నేతలు మాత్రం కొందరు ఉన్నప్పటికీ ఇప్పటి పరిస్థితుల్లో తాము రాజకీయాలు చేయలేమని చేతులెత్తేసినట్లు కనిపిస్తుంది పదేళ్ల ముందు రాజకీయాలు వేరు. ఇప్పటి రాజకీయాలు వేరు. ఇప్పడంతా వ్యక్తిగత విమర్శలు.. అక్రమ కేసులు... అనవసర రాద్ధాంతాలు...తప్ప పనికి వచ్చేది, ప్రజలకు ఉపయోగపడే పనులు తప్ప అన్నీ చేస్తున్నారన్న భావన ఉంది.
ఫేడ్ అవుట్ అయి...
దీంతో ఎవరి నాయకత్వం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ సీనియర్ నేతలు ముందుకు వచ్చి మళ్లీ రాజకీయం చేసే పని కనిపించడం లేదు. ఒక రకంగా వారు ఫేడ్ అవుట్ అయిపోయారు. దీంతో పాటు తమ వయసుకు, నాయకత్వం వహించేవారి వయసును చూసి కూడా సభలు, సమావేశాలలో తగిన గౌరవం లభిస్తుందో? లేదో? భావన బలంగా పడిపోయింది. అందుకే జిల్లాల్లో పదేళ్లకు ముందు ఉన్న సీనియర్లు ఇప్పుడు ఢిల్లీ గడప కూడా తొక్కడం లేదు. తాము గౌరవంగా రాజకీయాలు చేశామని, ఇప్పటి రాజకీయాలకు తాము సూట్ కాలేమని వారు సరిపెట్టుకుని ఇక స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నట్లే కనపడుతుంది. అందుకే షర్మిల ప్రస్తుతం జిల్లాల్లో పర్యటిస్తున్నా సీనియర్ నేతలు ఒక్కరూ కనిపించకపోవడానికి అదే కారణమని చెప్పక తప్పదు.