Yv Subba Reddy : అమరావతికి వ్యతిరేకం కాదు.. అవినీతికి మాత్రమే
అమరావతికి తాము వ్యతిరేకం కాదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు
అమరావతికి తాము వ్యతిరేకం కాదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బిల్లులో అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడంతో పాటు ప్రత్యేక హోదా విషయాన్ని కూడా పొందుపర్చలేదని తెలిపారు. అందువల్లనే తాము వ్యతిరేకించామని వైవీసుబ్బారెడ్డి చెప్పారు. అనేక రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను బిల్లులో పెట్టకపోవడంతో పాటు రైతులను ఏ విధంగా ఆదుకుంటారన్నది బిల్లులో పెట్టాలని తాము కోరామన్నారు.
రాజధాని పేరిట దోపిడీ...
అయితే అందుకు ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు. అమరావతి పేరిట దోపిడీ జరుగుతుందని, చదరపు అడుగు పన్నెండు వేల రూపాయలు చెల్లిస్తూ అక్రమంగా దోచుకుంటున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. తాము ఏడుగురు సభ్యులున్నప్పటికీ ఐదు నిమిషాలు మాట్లాడేందుకు అవకాశమివ్వలేదని రైతులకు న్యాయం చేయాలని కోరడం తప్పా అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. బిల్లులో అన్ని విషయాలను పొందుపరిస్తే మద్దతిచ్చి ఉండేవారమని చెప్పారు.