Nadendla Manohar : గుంటూరు "గ్లాసు" లో నాదెండ్ల నామ్ కే వాస్తేనా?
జనసేన నేత నాదెండ్ల మనోహర్ తన సొంత జిల్లాలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు అర్ధమవుతుం
జనసేన నేత నాదెండ్ల మనోహర్ తన సొంత జిల్లాలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు అర్ధమవుతుంది. నాదెండ్ల మనోహర్ జనసేనలో నెంబరు 2 గా ఉంటూ గుంటూరు జిల్లాలో పార్టీ ఎదుగుదలకు ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. జనసేనలో కీలకంగా ఉంటూ, గుంటూరు జిల్లాలో మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ తన సొంత జిల్లాలో జనసేన బలోపేతానికి ఏ మాత్రం ప్రయత్నం చేయడం లేదని, మరొకవైపు గుంటూరు జిల్లా జనసేన నేతలకు మాత్రం అడ్డుతగులుతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.
సాఫ్ట్ నేచర్ అయినా...
నాదెండ్ల మనోహర్ సాఫ్ట్ కార్నర్ ఉన్న వ్యక్తి. ఆయన ఎప్పుడూ.. ఎవరినీ హార్ష్ గా మాట్లాడరు. అలాగే పవన్ కల్యాణ్ ఆదేశాలను మాత్రమే ఆయన అమలు చేస్తున్నారని, పవన్ కల్యాణ్ కు క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలు కూడా తెలియకుండా అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. తన నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉంటే మాత్రం పవన్ కల్యాణ్ చెవిలో ఊది మరీ ఆయనను తీసుకెళ్లి పనులను చక్క బెట్టుకుంటున్నారని, కానీ ఇతర నియోజకవర్గాల జోలికి పవన్ వెళ్లకుండా నాదెండ్ల మనోహర్ అడ్డుకుంటున్నారని సొంత జిల్లాకు చెందిన నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటం గ్రామానికి పవన్ ను తీసుకెళ్లారు కానీ మిగిలిన చోట్లకు రానివ్వడం లేదని అంటున్నారు.
సభ్యత్వాలు కూడా...
ఇక ఉద్యమి పేరిట సభ్యత్వాల నమోదు విషయంలోనూ గుంటూరు జిల్లాలో పెద్దగా జరగకపోవడానికి నాదెండ్ల మనోహర్ వైఖరి కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నాదెండ్ల మనోహర్ తొలి నుంచి పార్టీలో నమ్మకంగా ఉండటంతో పాటు అవసరమైన రాజకీయ సలహాలు ఇస్తుండటంతో పవన్ కల్యాణ్ నాదెండ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని, దానిని అలుసుగా తీసుకుని మనోహర్ గుంటూరు జి్ల్లాలో పార్టీని ఎదగనివ్వకుండా చేస్తున్నారని, సొంత నియోజకవర్గమైన తెనాలిలోనే నాదెండ్లకు వ్యతిరేకత జనసైనికుల నుంచి వ్యక్తమవుతుందన్న విషయాన్ని గ్రహించాలని ఆ పార్టీ జిల్లా నేతలు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం విశేషం.