Summer Effect : వడగాలులు.. ఉక్కపోత.. ఉష్ణోగ్రతలు.. ప్రాణాలు నిలుపుకోవడమెలా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఉక్కపోత ఉక్కిరి బిక్కరి చేస్తుంది. ఊపిరి ఆగిపోయేంతగా చెమటలు పడుతున్నాయి. ఇంట్లో కూర్చున్నా, బయటకు వచ్చినా వేడిగాలుల సెగతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల మాత్రం తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది.
ఈ మండలాల్లో వడగాలులు...
ఆంధ్రప్రదేశ్ లో శనివారం 73 మండలాల్లో తీవ్రవడగాలులు, 17 మండలాల్లో వడగాలులు, ఆదివారం 32 మండలాల్లో తీవ్రవడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎండ తీవ్రత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో 16, విజయనగరం 24, పార్వతీపురంమన్యం 15, అల్లూరి 3, పోలవరం 9, అనకాపల్లి 2, కాకినాడ 3, తూర్పుగోదావరి 1 మండలాల్లో తీవ్రవడగాలులు(73) వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం 2, పోలవరం 2, అనకాపల్లి 1, కాకినాడ 2, తూర్పుగోదావరి 3, ఏలూరు 4, ఎన్టీఆర్ 1, పల్నాడు 2 మండలాల్లో వడగాలులు(17) ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు భారీగా...
తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. మరొకవైపు కొన్ని చోట్ల వానలు కూడా కురుస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే మిగిలిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నోదవుతాయని, వడగాల్పులు కూడా ఎక్కువగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది. వడగాలుల వీస్తున్నందున మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్ఎస్, ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.