Ys Jagan : చంద్రబాబు, రేవంత్ రెడ్డిల రహస్య ఒప్పందం ఏంటి?
చంద్రబాబు రాజకీయ స్వలాభం కోసం రాయలసీమకు అన్యాయం చేశారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు
చంద్రబాబు రాజకీయ స్వలాభం కోసం రాయలసీమకు అన్యాయం చేశారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయకుండా తెలంగాణతో కుమ్మక్కై సీమ ప్రాంత ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశారన్నారు. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాయలసీమకు, నెల్లూరుకు ఆ ప్రాజెక్టు ముఖ్యమైనదని తెలిసినప్పటికీ చంద్రబాబు మాత్రం రాయలసీమ ఎత్తిపోతల అవసరం లేదని మాట్లాడుతున్నారని జగన్ మండి పడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వెనక గొప్ప ఆలోచన ఉందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు.
అనేక పథకాలతో తెలంగాణ...
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించారని, ఎస్ఎల్బీసీ నుంచి అదనంగా నీటిని తీసుకెళ్లే పనులు సాగుతున్నా చంద్రబాబు కిమ్మనకుండా ఉండాలన్నారు. జూరాల నుంచి మరొక టీఎంసీ నీటిని తెలంగాణ తరలించే ప్రక్రియను కూడా అడ్డుకోలేదని అన్నారు. శ్రీశైలం ఎడమ వైపు ఉన్న పవర్ హౌస్ ద్వారా మరో నాలుగు టీఎంసీల నీటిని తెలంగాణ తరలిస్తుందని, అయినా చంద్రబాబుకు చీమకుట్టినట్లయినా లేదని తెలిపారు. తెలంగాణలో ఇష్టమొచ్చినట్లు నీటిని తోడేస్తున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్నిచంద్రబాబుకు చెప్పి ఆపించానని రేవంత్ రెడ్డి శాసనసభలో చెప్పిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు.
ఓటుకు నోటు కేసులో...
చంద్రబాబుకు, రేవంత్ రెడ్డి మధ్య రహస్య ఒప్పందం ఏంటని జగన్ ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు నుంచి 101 టీఎంసీల కేటాయింపు ఉన్నా వినియోగించుకోలేకపోతున్నామని తెలిపారు. ఏపీని చంద్రబాబు ఎలా అమ్మకం పెట్టారో రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారని జగన్ అన్నారు. రాష్ట్రానికి, రాయలసీమకు విఘాతం కలిగించే నిర్ణయాలన్నీ చంద్రబాబు హయాంలో తీసుకున్నవేనని జగన్ అన్నారు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియోలతో అడ్డంగా దొరికిపోయి నోరు మెదపని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారన్నారు. అప్పట్లోనే తాను రాష్ట్ర పరిస్థితులపై జలదీక్ష చేశానని అన్నారు. కల్వకుర్తి విస్తరణ, ఎస్ఎల్బీసీ, పాలమూరు - రంగారెడ్డి, దిండి కూడా పర్యావరణ అనుమతుల్లేవని, ఆ పనులను ఆపాలని ఎన్.జి.టి ఆదేశిలిచ్చినా పట్టించుకోలేదన్నారు.