Amaravathi : రెండో విడత భూ సమీకరణ అంత సులువు కాదా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రభుత్వానికి సవాల్ గా మారిందనే చెప్పాలి

Update: 2026-01-09 04:24 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రభుత్వానికి సవాల్ గా మారిందనే చెప్పాలి. మొదటి విడతలో తీసుకున్నంత సులువు మాత్రం కాదు. రైతుల్లో అనేక సందేహాలున్నాయి. గత పదకొండేళ్లుగా రాజధాని అమరావతి అభివృద్ధి చెందకపోవడం, కనీసం మౌలిక సదుపాయలు కల్పించకపోవడం, నాడు రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వకపోవడం వంటి కారణాలు రెండో దశ పూలింగ్ కు ఇబ్బందిగా మారాయని చెప్పాలి. ప్రభుత్వాలు మారితే తమ పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు పాలకుల నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. తమ పరిధిలో ఉన్న వాటికి మాత్రమే కొన్నింటికి హామీలు ఇస్తున్నారు.

అనేక అనుమానాలు...
ఏడో తేదీన అధికారికంగా ప్రారంభమయిన ల్యాండ్ పూలింగ్ మూడు రోజుల్లో పెద్దగా రైతులు ముందుకు రాకపోవడం ఇందుకు నిదర్శనం రెండో దశ పూలింగ్ సందర్భంగా రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వడ్డమాను గ్రామంలో రెండో దశ పూలింగ్ సమయంలో రైతులు మంత్రి నారాయణ ముందే కుండబద్దలు కొట్టారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గ్రామ సభలో నిర్వహించకుండా పూలింగ్ లో భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. నిర్ణీత సమయంలో అభివృద్ధి చేయకపోతే రైతుకు కనీసం ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని చట్టంలో పొందుపరచాలని కోరామని అది చేర్చకుండా సరైన అభిప్రాయం చెప్పకుండా వెంటనే పూలింగ్ ప్రక్రియ ప్రారంభించడం ఏమిటని కొందరు నిలదీశారు.
అగ్రిమెంట్ లో చేరుస్తామంటేనే....?
రిటర్నబుల్ ప్లాట్ లకు సంబంధించి విస్తీర్ణం పెంచాలని కోరామని అది తేల్చలేదని, నాలుగేళ్ల తర్వాత అభివృద్ధి చేయకపోతే పరిహారం ఇవ్వాలనే అంశంపై రైతులు లేవనెత్తిన డిమాండ్ ఇప్పుడు ప్రభుత్వంలో కూడా చర్చనీయాంశం అయింది. గతంలో పూలింగ్ లో భూములు తీసుకున్న ప్రాంతంలో ప్రభుత్వ మారగానే అభివృద్ధి పనులు ఆపేశారని రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసామని రైతులు తెలిపారు. అందుకనే తాము అభివృద్ధికి గ్యారెంటీ ఇవ్వాలని కోరుతున్నామని డిమాండ్ చేశారు. గత అనుభవాల దృష్ట్యా తాము ఈ డిమాండ్ పెడుతున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఒకవేళ ప్రభుత్వాలు మారితే ఇప్పుడు భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. మరొకవైపు తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలతో రైతులు మరింత డైలామాలో పడతారంటున్నారు. అయితే మంత్రులు దీటుగా స్పందించడంతో రైతులను ఒప్పించి భూసమీకరణ చేస్తామని పాలకులు చెబుతున్నారు. మొత్తం మీద తొలి దఫా చేసినంత సులువుగా రెండో విడత భూ సమీకరణ సాధ్యం కాదన్నది అక్కడి పరిస్థితులను చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది.
నారాయణ మాత్రం...
రాజ‌ధాని విస్త‌ర‌ణ కోసం చేప‌డుతున్న ల్యాండ్ పూలింగ్ కు రైతుల నుంచి అనూహ్య స్పంద‌న వ‌స్తుందని మరొకవైపు అధికారులు తెలిపారు. అమ‌రావ‌తిలో ఇన్న‌ర్ రింగ్ రోడ్డు,ఇంట‌ర్నేష‌న‌ల్ స్పోర్ట్స్ సిటీ,రైల్వే స్టేష‌న్,రైల్వే లైన్ కొర‌కు ప్ర‌భుత్వం భూస‌మీక‌ర‌ణ చేప‌డుతుంది. కేవ‌లం గంట‌లోనే 413 ఎక‌రాల‌కు సంబంధించిన భూయ‌జ‌మానులు త‌మ భూమిని ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ ఫారం - 1 ను మంత్రి నారాయ‌ణ‌కు అంద‌జేశారని అధికారులు తెలిపారు.అమ‌రావ‌తిపై దుష్ప్ర‌చారం చేస్తూ వ్యాఖ్య‌లు చేసిన మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పై మంత్రి నారాయ‌ణ తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. 2014-19లో లే అవుట్ ప్లాన్,మాస్ట‌ర్ ప్లాన్,రోడ్లు డిజైన్ చేయ‌డానికి చాలా ఆల‌స్యం అయిందని...ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందు మాత్ర‌మే ప‌నులు ప్రారంభించిన‌ట్లు తెలిపారు...అయితే కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత గ‌త ప్ర‌భుత్వం నిర్వాకంతో వ‌చ్చిన సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించి ప‌నులు ప్రారంభించేందుకు 8 నెల‌లు ప‌ట్టింద‌న్నారు..ప్ర‌స్తుతం అమ‌రావ‌తిలో రోడ్లు,భ‌వ‌నాలు,ఇత‌ర మౌళిక వ‌స‌తుల ప‌నులు వేగంగా జ‌ర‌గుతున్నాయ‌ని రైతుల‌కు వివ‌రించారు.


Tags:    

Similar News