RK Roja : రోజాపై కూటమి ప్రభుత్వం సాఫ్ట్ కార్నర్ తో ఉన్నట్లుందా?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది

Update: 2026-01-08 09:09 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మాత్రం ఒక అసంతృప్తి అనేది కనపడుతుంది. రెండేళ్లవుతున్నప్పటికీ మాజీ మంత్రి ఆర్కే రోజాను కట్టడి చేయలేకపోతున్నామని, ఆమెపై అనేక కేసులు పెండింగ్ లో ఉన్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో పార్టీ క్యాడర్ నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆర్కే రోజా తాజాగా నెల్లూరు జిల్లా జైలును సందర్శించి పిన్నెల్లి బ్రదర్స్ తో ములాఖత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయినా సరే ఆర్కే రోజా పై ఎలాంటి చర్యలకు తీసుకోకపోవడంపై సోషల్ మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో...
ఆర్కే రోజాపై ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పెద్దయెత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు టీడీపీ నేతలే చేశారు. కూటమి ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక కూడా సమర్పించిందంటున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున అవినీతి జరగిందని టీడీపీ నేతలే చెబుతున్నారు. వంద కోట్లకు పైగానే ఈ ఆడుదాం ఆంధ్ర్ర కార్యక్రమంలో అవినీతి జరిగిందిని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు తేల్చినట్లు పెద్దయెత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ ఇంత వరకూ ఆ కేసు పరిస్థితి ఏంటని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. చట్టపరంగానైనా అవినీతిని బయటపెట్టి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందని పార్టీ కార్యకర్తల నుంచే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఎప్పుడంటూ...
ఆర్కే రోజా వైసీపీ అధికారంలో ఉన్నప్పడు తొలి రెండున్నరేళ్లు ఏపీఐఐసీ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేసి తర్వాత టూరిజం, క్రీడల శాఖ మంత్రిగా పదవి బాద్యతలను చేపట్టారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరిట వైసీపీ ప్రభుత్వ హయంలో రాష్ట్రమంతటా క్రీడా సంబరాలను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆడుదాం ఆంధ్రపేరిట వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని టీడీపీ నేతలు సీఐడీ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే పాత్యా సంఘం, కబడ్డీ అసోసియేషన్ లు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సీఐడీకి ఫిర్యాదు చేశాయి. పెద్దయెత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గత కొన్నాళ్లుగా విచారణ చేసి దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించారంటున్నారు. మరి రోజా మాటేమిటి అని మాత్రం పార్టీ క్యాడర్ నేరుగా పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తుంది. మరొకవైపు నారా లోకేశ్ మాత్రం రెడ్ బుక్ లో మూడు పేజీలు మాత్రమే పూర్తయ్యాయని, మిగిలింది చాలా ఉందని చెబుతున్నారని.. ఇంకా ఎప్పుడంటూ పలువురు నిలదీస్తున్నారు.





Tags:    

Similar News