Andhra Pradesh : అసెంబ్లీ సమావేశాలకు జగన్ రానున్నారా?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అన్నది ఇంకా తేలలేదు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అన్నది ఇంకా తేలలేదు. రేపటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు వైఎస్ జగన్ బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. వైఎస్ జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కల్పించకపోవడంపై వారు సభకు రావడం లేదు. అయితే గత ఏడాది బడ్జెట్ సమావేశాలకు మాత్రం జగన్ హాజరయ్యారు. ఆ ఒక్కరోజు మాత్రమే వచ్చిన జగన్ తర్వాత సభకు హాజరు కాలేదు. ఈసారి కూడా అలాగే చేసే అవకాశముందని చెబుతున్నారు. రేపు గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి సభకు హాజరై తర్వాత వెళ్లిపోతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పదకొండు సీట్లు రావడంతో...
గత ఎన్నికల్లో వైసీపీకి పదకొండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే లభించాయి. అయితే శాసనసభలో ఉన్న సభ్యుల సంఖ్యలో పది శాతం మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తామని అధికార పార్టీ చెబుతుంది. కానీ సభలో విపక్షం అనేది లేదని, గత ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన మూడు పార్టీల సభ్యులే ఉన్నాయని, అందుకే వైసీపికి ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ జగన్ డిమాండ్ చేస్తున్నారు. తనకు ప్రతిపక్ష హోదా కల్పిస్తే సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం పడుతుందని జగన్ వాదిస్తున్నారు. తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని జగన్ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అయితే న్యాయస్థానం మాత్రం ఎటువంటి తీర్పు ఇవ్వలేదు.
ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప....
దీంతో అప్పటి నుంచి తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీ సమావేశాలకు రానని తెలిపారు. కేవలం బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు వచ్చి వెళ్లిపోతున్నారు. మరొకవైపు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఇటీవల అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పదే పదే చెబుతున్నారు. జగన్ సమావేశానికి వస్తే సమయం ఇచ్చది లేనిది తెలుస్తుంది కదా? అని అధికార పక్షం ప్రశ్నిస్తుంది. అయితే తనకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే వస్తానని ఆయన చెబుతున్నారు. మొత్తం మీద ప్రతిపక్ష హోదా కోసం జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పాలకపక్షం విమర్శిస్తుంది. మరొకవైపు ఈసారి కూడా అదే రీతిలో జగన్ తొలి రోజు సభకు వచ్చి వెళతారని అంటున్నారు. ఇందుకోసం పార్టీ నేతలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి.