Kolikapudi : కొలికపూడిపై చర్యలు తీసుకోకపోవడానికి కారణాలివేనట
కొలికపూడి శ్రీనివాసరావు పార్టీ కంట్రోల్ తప్పారు.
కొలికపూడి శ్రీనివాసరావు పార్టీ కంట్రోల్ తప్పారు. ఎన్ని సార్లు హెచ్చరించినా ఆయనలో మార్పు రావడం లేదని పార్టీ నాయకత్వం భావిస్తుంది. తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్నిల మధ్య వార్ కు ఫుల్ స్టాప్ పడనట్లే కనిపిస్తుంది. తన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నడుపుతున్నారని, మద్యం దుకాణాల యజమానులు సిండికేట్ గా ఏర్పడి లిక్కర్ బాటిల్ పై ఎమ్మార్పీ కంటే ఇరవై నుంచి ముప్ఫయి రూపాయలకు మద్యం దుకాణాల్లో అమ్ముతున్నారని, బెల్ట్ షాపుల్లో క్వార్టర్ బాటిత్ యాభై రూపాయలకు పైగానే విక్రయిస్తున్నారని ట్వీట్ చేయడం మరొకసారి పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వవైఫల్యాలను...
ఇది ఎంపీ అనుచరులను ఉద్దేశించి చేసిన ట్వీట్ అని ప్రత్యర్థులుకూడా చెబుతున్నారు. ఎక్సైజ్ అధికారులు కూడా తిరువూరు నియోకవర్గంలో మద్యం దుకాణాల యజమానులతో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు.ఒక రకంగా ప్రభుత్వ వైఫల్యాలను కొలికపూడి చేస్తున్న విమర్శలు తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి పెడుతున్నాయి.అలాగే పార్టీ పరువును మరింతగా బజారున పడనుంది. ఎప్పటికప్పుడు తాను మారానని, తాను హైకమాండ్ చెప్పినట్లే నడుచుకుంటానని చెబుతూనే కొలికపూడి కంట్రోల్ తప్పుతుండటం మరోసారి చర్చనీయాంశమైంది.
నిర్ణయం తీసుకోకపోవడం....
కొలికపూడి శ్రీనివాసరావు విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని కూడా కొందరు నేతలు సోషల్ మీడియా వేదికగా తప్పుపడుతున్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా అప్పటికప్పుడు తగ్గినట్లే కనపడుతూ మళ్లీ చెలరేగి పోతుండటంతో పార్టీ నాయకత్వం కూడా ఏమీ చేయలేకపోతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొలికపూడిని ఇలా వదిలేస్తే మిగిలిన నేతలకు భయం లేకుండా పోతుందని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, కొలికపూడి శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ లో తప్పేముందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. జరుగుతున్న తప్పులను ప్రభుత్వం సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో విజయం లభిస్తుందని కూడా మరికొందరు సూచిస్తున్నారు. మొత్తం మీద కొలికపూడి వ్యవహారం మరోసారి టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.