Arava Sridhar : సింగిల్ టైం ఎమ్మెల్యే.. చేజేతులా.. రాజకీయ జీవితం ముగించేసుకున్నట్లేనా?
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారాన్నిజనసేన నాయకత్వం పక్కన పెట్టేసినట్లే కనపడుతుంది
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారాన్నిజనసేన నాయకత్వం పక్కన పెట్టేసినట్లే కనపడుతుంది. అది పూర్తిగా వారి వ్యక్తిగత వ్యవహారంగా పరిగణించి ఇక వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది. అరవ శ్రీధర్ పై ఆరోపణలు వచ్చినప్పుడు హడావిడిగా కమిటీని నియమించిన జనసేన నాయకత్వం తర్వాత మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. వివాహేతర సంబంధాల విషయంలో పార్టీకి ఏం సంబంధం ఉంటుందని అంటున్నారు. అందుకే చూసీ చూడనట్లు వదిలేయాలని నిర్ణయించుకుందని అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది.
నెలలు గడుస్తున్నా...
ఈ వ్యవహారంపై నియమించిన కమిటీ ఇంత వరకూ పవన్ కల్యాణ్ కు నివేదిక అందించిందో లేదో తెలియదు. పవన్ కల్యాణ్ నియమించిన త్రిసభ్య కమిటీ నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడంపై బయట నుంచి వచ్చే విమర్శలను పెద్దగా పట్టించుకోవడం లేదు. మరొకవైపు అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంలో ఎటువంటి తప్పులేదని, అయితే తాము పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంచుతున్నామని జనసేన నేతలు చెబుతున్నారు.
రోజుకొక వీడియో వస్తున్నా...
అరవ శ్రీధర్ పై రోజుకొక వీడియోను ఆ యువతి విడుదల చేస్తూనే ఉంది. పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ తాము పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించామని, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్యే హోదాలో హాజరవుతున్నారని జనసేన నేతలు వాదిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే అరవ శ్రీధర్ వ్యవహారాన్ని చూసీ చూడనట్లు ముగించడమే మేలన్న అభిప్రాయం పార్టీ నాయకత్వంలో కనపడుతుంది. అయితే ఈసారి మాత్రం ఎన్నికల్లో దూరంగా ఉంచేందుకు పవన్ కల్యాణ్ నిర్ణయించారని, అప్పటి వరకూ ఓపిగ్గా చూడమని రైల్వే కోడూరు జనసేన నేతలు చెబుతున్నారు.