AP BJP : తిరుమల లడ్డూ వివాదంలో బీజేపీ నేతలు పెదవి విప్పడం లేదే.. ఏమైంది చెప్మా?

తిరుమల లడ్డూ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తుంది

Update: 2026-02-07 07:51 GMT

తిరుమల లడ్డూ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తుంది. ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. తిరుమల లడ్డూను కల్తీ నెయ్యితో తయారు చేశారని, మహాపరాధం చేశారని అధికారపార్టీ అంటుంది. కానీ సీబీఐ సిట్ మాత్రం అవేవీ తేల్చకుండానే ఎలా చెబుతారంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే కూటమిలో మిత్రపక్షమైన బీజేపీ మాత్రం తిరుమల లడ్డూ వ్యవహారంలో తొలి నుంచి నోరు మెదపడం లేదు. ఒకరకంగా హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ ఈ మౌనం ఎందుకు పాటిస్తుందన్నది కూటమిలో ఉన్న టీడీపీ, జనసేనలకు కూడా అర్థం కావడం లేదు. గతంలో ఎక్కడ ఆలయంలో ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే స్పందించే బీజేపీ రాష్ట్ర నేతలు ఇప్పుడు తిరుమలేశుడి ప్రసాదం వివాదం జరుగుతున్నా పెదవి విప్పడం లేదు.

తిరుమల లడ్డూ వ్యవహారంలో...
గతంలో అనేక విషయాలపై ఆందోళన చేసిన బీజేపీ తిరుమల లడ్డూ వ్యవహారంలో మాత్రం అసలు స్పందించకపోవడానికి కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మాజీ అధ్యక్షులు పురంద్రీశ్వరి, సోము వీర్రాజులు సయితం ఈ విషయంలో ఇప్పటి వరకూ స్పందించలేదు. మిగిలిన అంశాలలో కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటూ వాయిస్ వినిపిస్తున్నప్పటికీ తిరుమల లడ్డూ వ్యవహారంలో మాత్రం కమలనాధులు కామ్ గా ఉండటం ఒకింత సందేహాలకు తావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సీబీఐ సిట్ అందించిన నివేదిక వల్లనే వారు మాట్లాడటం లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
గతంలో ఏ చిన్న ఘటన జరిగినా...
అంతర్వేదిలో రథం తగలపడినా.. రామతీర్థం లో విగ్రహం ధ్వంసమయినా పూనకాలు వచ్చిన వారిలా ఊగిపోయిన నేతలు ఇప్పుడు సాక్షాత్తూ ఏడుకొండల వాడి విషయంలో జరిగే రాద్ధాంతంపై తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. సీనియర్ నేతలు కూడా దీనిపై మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. ఇటీవల కూటమి లోని మూడు పార్టీలు తిరుమల లడ్డూ విషయంలో సమావేశమయినప్పటికీ అందరూ మీడియా సమావేశంలో మాట్లాడారు కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాత్రం మాట్లాడకపోవడాన్ని కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దీంతో కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వీరు నడచుకుంటున్నారన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News