Ys Jagan : అదే జగన్ బలం.. ఆ నమ్మకమే మళ్లీ నిలబెడుతుందా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పట్ల ప్రజల్లో నమ్మకం సడలలేదు. ముఖ్యంగా జగన్ ఒక విషయలో మాత్రం సక్సెస్ అయ్యారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పట్ల ప్రజల్లో నమ్మకం సడలలేదు. ముఖ్యంగా జగన్ ఒక విషయలో మాత్రం సక్సెస్ అయ్యారు. తాను మాట ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తానన్న నమ్మకాన్ని అయితే జనంలోకి బలంగా తీసుకెళ్లగలిగారు. అదే జగన్ కు ప్లస్ పాయింట్. మిగిలిన విషయాల్లోనూ, పరిపాలనలోనూ, ప్రజలకు అందుబాటులో అనేక విమర్శలు ఉన్నప్పటికీ సాధారణ ప్రజలు మాత్రం జగన్ వైపు చూడటానికి ఇచ్చిన మాటను తప్పడన్న విశ్వాసాన్ని నెలకొల్పడంలో గత ఐదేళ్ల ప్రభుత్వ హయంలో జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన చూసినప్పుడు జగన్ గురించి ఏపీలోని సాధారణ ప్రజలు ఎక్కువగా చర్చించుకోవడం మళ్లీ ప్రారంభమయింది.
ఇచ్చిన హామీలను...
కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, కేవలం రాజధాని అమరావతికే నిధులన్నీ చంద్రబాబు వెచ్చిస్తున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. రుషికొండలో ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన భవనంపై యాగీ యాగీ చేసిన వారు ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భవనాలను నిర్మించడంతో పాటు హెలికాప్టర్లను కొనుగోలు చేయడం వంటివి జనంలోకి వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా బాగా తీసుకెళుతున్నారు. చంద్రబాబు తమ వర్గానికి ఏమీ చేయరని, జగన్ అయితే తమను పట్టించుకుంటారన్న నమ్మకం పేద, మధ్యతరగతి ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అదే జగన్ కువచ్చే ఎన్నికల్లో బలంగా మారనుంది.
ఫీడ్ బ్యాక్ తమకు అనుకూలంగా...
ఫీల్డ్ లెవెల్ నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ తమకు అనుకూలంగా వస్తుండటంతో జగన్ బిందాస్ గా ఉన్నారని చెబుతున్నారు. అందుకే జనంలోకి వెళ్లేందుకు కూడా ఆయన పర్యటనలను వాయిదా వేసుకుంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ నేతలు ఎంత మంది వెళ్లినా? ఎందరు అరెస్టయినా? చివరకు తనను అరెస్ట్ చేసినా అది పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని జగన్ భావిస్తున్నారు. అందుకే ఎప్పుడెప్పుడు నోటీసులు అందుతాయి? ఎప్పుడెప్పుడు తనను అరెస్ట్ చేస్తారన్న దానిపై జగన్ ఎదురు చూస్తున్నారని కూడా అంటున్నారు. జగన్ జైలుకు వెళ్లడానికి ఏ మాత్రం భయ పడటం లేదని, మానసికంగా సిద్ధమయ్యారని పేర్నినాని వంటి వారు చెప్పడం ఇందుకేనని చెబుతున్నారు.
జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత...
జగన్ జిల్లా పర్యటనలు కూడా జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత చేస్తే మరింత హైప్ పెరుగుతుందని ఆగారంటున్నారు. తనకు సానుభూతి పెరగడమే కాకుండా, జనం నుంచి మంచి రెస్పాన్స్ బాగా వస్తుందని భావిస్తున్నారు. అందుకే ఉగాది నుంచి జగన్ జిల్లాల పర్యటనలు వాయిదా వేసుకుంటూ వస్తున్నారని చెబుతున్నారు. మద్యం స్కామ్ కేసులో తనను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని జగన్ భావిస్తున్నారని, జైలు కు వెళ్లి బెయిల్ పై వచ్చిన తర్వాత అయితే తన జిల్లాల పర్యటనలకు జనం పోటెత్తుతారని, క్యాడర్ కూడా కదిలి రావడమే కాకుండా, నేతలు కూడా యాక్టివ్ అయి పార్టీకి వచ్చే ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తాయన్న అంచనాలో జగన్ ఉన్నారని అంటున్నారు. మొత్తం మీద జగన్ అంచనాలు ఇలా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందన్ని చూడాలి.