Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ రూపు రేఖలు మారకపోవడానికి అదే కారణమా?
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తిరిగి గన్నవరం పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు.
గన్నవరం రాజకీయాలు మళ్లీ గరం గరంగా మారనున్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తిరిగి గన్నవరం పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు. దాదాపు రెండేళ్ల పాటు గన్నవరం రాజకీయాలకు దూరంగా ఉన్న వల్లభనేని వంశీ తాజాగా ఇప్పుడు తిరిగి తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వల్లభనేని వంశీ తిరిగి యాక్టివ్ కావడంతో అక్కడ వైసీపీ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. గన్నవరం నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వల్లభనేని వంశీ రూపు రేఖలు కూడా జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మారిపోయాయి.
అదే రకంగా...
ఇప్పటికీ అదే రకంగా వల్లభనేని వంశీ మెయిన్ టెయిన్ చేస్తున్నారు. గతంలో యువకుడిగా కనిపిస్తూ, జట్టుకు రంగు వేసుకుని కనిపించే వల్లభనేని వంశీ గత కొద్ది రోజుల నుంచి మాత్రం తెల్లజుట్టు, బక్కపలచగానే ఉన్నారు. అది కేవలం సెంటిమెంట్ తోనే వంశీ జనంలోకి వెళ్లి సింపతీని పొందాలనుకుంటున్నట్లుంది. అందుకే ఆయన తన రూపు రేఖలను మార్చుకునే ప్రయత్నం చేయడం లేదు. వల్లభనేని వంశీని గతంలో , ఇప్పుడు చూసిన వారికి పాపం.. అనిపించేలా వంశీ ఉండటం ఆయనకు కలసి వచ్చే అంశమని చెబుతున్నారు. జైల్లో 140 రోజుల పాటు ఉన్న వల్లభనేని వంశీ తెల్ల జుట్టుతో పాటు అనేక ఆరోగ్య పరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వచ్చే ఎన్నికల వరకూ ఇదే రకంగా మెయిన్ టెయిన్ చేసి తిరిగి గెలుపొందేలా ప్లాన్ చేసుకున్నారని తెలిసింది.
గన్నవరంలో వరస పర్యటనలతో...
వల్లభనేని వంశీ ఇటీవల వరసగా అనేక వివాహ వేడుకలకు హాజరయ్యారు. అక్కడ టీడీపీ నేతలను కూడా పలుకరించడం, ఆత్మీయంగా దగ్గరకు తీసుకోవడం చర్చనీయాంశమైంది. వివాహ వేడుకలలో మాత్రమే కాకుండా అనేక కార్యక్రమాలకు కూడా ఆయన హాజరవుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారు. తాను ఎక్కడకూ వెళ్లనని, ఇక్కడే ఉండి రాజకీయాలను కొనసాగిస్తానని చెబుతున్నారు. తనపై పదకొండు కేసులు నమోదయ్యాయని, ఇంతకు మించి ఏం చేస్తారన్న ధీమా వల్లభనేని వంశీలో స్పష్టంగా కనిపిస్తుంది. గన్నవరం టీడీపీలో నెలకొన్న అసంతృప్తులను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.