Andhra Pradesh : రాయదుర్గంలో ఏదో జరుగుతుంది.. అర్థమవుతుందా?

అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతుంది

Update: 2025-12-17 08:04 GMT

అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో టీడీపీ, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతుంది. బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి ముందస్తు వ్యూహంతో వెళుతున్నట్లే కనిపిస్తుంది. బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన మనసంతా వైసీపీలో ఉన్నట్లే కనిపిస్తుంది. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో చేరారు. అయితే ఆయన వ్యవహారశైలిని చూస్తుంటే బీజేపీలో ఎక్కువ రోజులు ఉండేటట్లు కనిపించడం లేదు. తన మైనింగ్ వ్యవహారాలను కాపాడుకోవడానికే బీజేపీలో చేరారని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు వంటి వారు విమర్శిస్తున్నారు. ఆయన అక్రమంగా గనులను తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఇటీవల టీడీపీ నేతలు ఆందోళనకు కూడా దిగారు. కానీ కాపు రామచంద్రారెడ్డి మాత్రం వైసీపీలో ఉన్నవారందరికీ బీజేపీ కండువాలను కప్పుతున్నారు.

బీజేపీలో ఉన్నా...
కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలుపొందారు. 2009లో గెలిచిన కాపు 2012లో జరిగిన ఉపఎన్నికలలో గెలుపొందారు. తిరిగి 2019 లో గెలిచారు. రాయదుర్గం నుంచి గెలుస్తూ వస్తున్న కాపు రామచంద్రారెడ్డికి గత ఎన్నికల్ల వైఎస్ జగన్ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో చేరారు. కానీ బీజేపీలో చేరినప్పటికీ అక్కడ కూటమి నేతలకు మధ్య పొసగడం లేదు. టీడీపీ వర్సెస్ బీజేపీగా రాయదుర్గం నియోజకవర్గంలో నడుస్తుంది. వైసీపీ ఇక్కడ కొంత సైలెంట్ గా ఉన్నప్పటికీ ప్రధానంగా బీజేపీ, టీడీపీ ల మధ్య వైరం కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది. కాల్వ శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి లు గత కొన్ని ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేయడంతో కూటమి పార్టీలో ఉన్న సయోధ్య కుదరలేదు.
కూటమిలోని రెండు పార్టీలు...
ఇక్కడ కూటమి తరుపున ఏ కార్యక్రమం జరిగినప్పటికీ టీడీపీ, బీజేపీ లు ఎడమొఖం,పెడముఖంలానే ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో టీడీపీ నేతలతో పాటు బీజేపీ నేతలు పాల్గొనడం లేదు. అయితే కాపు రామచంద్రారెడ్డి కేవలం తన గనుల తవ్వకాల కోసమే తాత్కాలికంగా బీజేపీ పంచన చేరారని, ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలోకి వెళ్లడం ఖాయమని టీడీపీ నేతలు చెబుతున్నారు. అటువంటి నేతకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని కొందరు టీడీపీ నేతలు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయినా బీజేపీ నేతలు మాత్రం పట్టించుకోకపోవడంతో రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ బీజేపీ అన్న రీతిలోనే కార్యక్రమాలు సాగుతున్నాయి. బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి కి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నిరసన ప్రదర్శనలు కూడా చేస్తుండం రాయదుర్గం నియోజకవర్గం ప్రత్యేకత.


Tags:    

Similar News