Nara Lokesh : లోకేశ్ గురించి ఢిల్లీలో ఈ రకమైన టాక్ వినపడుతుందా?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ స్థాయిలో పట్టు సంపాదించారు.

Update: 2025-12-02 07:07 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ స్థాయిలో పట్టు సంపాదించారు. ఏపీకి భవిష్యత్ నేతగా ఇప్పటికే హస్తినలో ముద్రపడిపోయారు. అనేక మంది కేంద్ర మంత్రులు సయితం లోకేశ్ త్వరలోనే కీలకమైన పదవి చేపట్టనున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం రెండేళ్లలోనే లోకేశ్ ఈ రేంజ్ లో దూసుకుపోయారు. తండ్రి చంద్రబాబు రాజకీయ వారసత్వంతో పాటు తండ్రి ఎన్టీఆర్ లెగసీని కూడా ఒడిసిపట్టుకుని తాను నాయకుడుగా ఎదిగేందుకు ఉపయోగించుకున్నారు. ఇప్పటికే హస్తినలో లోకేశ్ గురించి పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికే నాలుగు దఫాలుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టడంతో లోకేశ్ పగ్గాలు చేపట్టడం ఎంతో దూరం లేదని అనుకుంటున్నారు. నేడు కూడా ఢిల్లీలో ఆయన పర్యటిస్తున్నారు.

బాబు ఫిట్ గా ఉన్నా...
కానీ చంద్రబాబు నాయుడు వయసు మీదపడినా ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నారు. ఆయన ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరహాలో ఎక్కువ కాలం రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలని భావిస్తున్నారు. కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలని భావించిన చంద్రబాబు నిన్న మొన్నటి వరకూ పార్టీ కార్యక్రమాలతో పాటు అన్ని విషయాలను లోకేశ్ కు అప్పగించిన చంద్రబాబు పాలనపరమైన విషయాల్లోనూ లోకేశ్ ను చురుగ్గా పాల్గొనేలా చేస్తున్నారు. మంత్రిగా ఉన్న లోకేశ్ ను తన వెంట తిప్పుకుంటున్నారు. పుట్టపర్తికి ప్రధాని వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా, ఉప రాష్ట్రపతి వచ్చినా చంద్రబాబుతో పాటు లోకేశ్ కూడా హాజరవ్వడాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ ధోరణితోనే చూస్తున్నారు.
అయితే తొందరపడకుండా...
నారా లోకేశ్ కూడా ఏ స్థాయిలో తొందరపడటం లేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ తర్వాత తాను అంటూ బయటకు కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు రాష్ట్రంలో ఇప్పటికే పట్టు పెంచుకున్న నారా లోకేశ్ ఢిల్లీ స్థాయిలో పరిచయాలు, పట్టు పెంచుకునే కార్యక్రమంలో భాగంగా వరసగా హస్తిన చుట్టూ తిరుగుతున్నారు. ఇక విదేశాల్లో కూడా ఆయన పర్యటిస్తూ నాటి చంద్రబాబు తరహాలోనే పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు లోకేశ్ ను అత్యున్నత పదవిలో చూడకపోయినా ఆయన ట్రైనింగ్ పూర్తయి సిద్ధంగా ఉన్నారని, ఏ సమయంలోనైనా కీలక పదవి చేపట్టే అవకాశముందని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. అందుకే లోకేశ్ వద్దకు నాయకులు క్యూ కడుతున్నారు. గత ఎన్నికలకు ముందు నుంచే ఈ రకమైన అభిప్రాయం వినిపించినా రెండేళ్లకు అది రెట్టింపయిందని అంటున్నారు.


Tags:    

Similar News