Nara Lokesh : లోకేశ్ ఆత్మీయ సమావేశాలు అందుకేనా? క్యా ఐడియా సర్ జీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ రాజకీయంగా రాటు దేలారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ రాజకీయంగా రాటు దేలారు. ఆయన టీం కూడా ఆయన రాజకీయ ఎదుగుదలకు విన్నూత్న ఐడియాలు ఇస్తూ భవిష్యత్ లో నాయకత్వ బాధ్యతలపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది. అందులో భాగంగానే ఇటీవల నారా లోకేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఆత్మీయ సమావేశమవుతున్నారు. వారితో డిన్నర్ చేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాలుగా వచ్చిన కుటుంబ సభ్యులకు మంగళగిరి పట్టు చీరలు పెట్టి సోదర భావాన్ని వారిలో కల్పిస్తున్నారు. సాధారణంగా నారా లోకేశ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీకి చెందిన నేతల కుటుంబాలనే కలుస్తారనుకుంటారు.
కూటమి నేతలందరితోనూ...
కానీ భవిష్యత్ లోనూ కూటమి కలిసి ఉంటుందన్న సంకేతాలు ఇవ్వడానికి, తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టినా ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు ఉండేలా జాగ్రత్త పడుతున్నారన్న కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అందులో తప్పేమీ లేదు. వారిని కేవలం ఆత్మీయ విందుకని పిలిచి భోజనాలు పెట్టి పంపించడం లేదు. అలాగే పట్టు చీరలు ఇచ్చి సంతృప్తి పర్చడం లేదు. వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. పిల్లల చదువు, కుటుంబ నేపథ్యం, యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. అంటే దాదాపు అందరు ప్రజాప్రతినిధులతో పాటు వారి కుటుంబ సభ్యులతోనూ తాను కనెక్ట్ అయి అనుబంధాన్ని పెంచుకుని తన రాజకీయానికి రాచ బాట వేసుకుంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ఏ నేత చేయని విధంగా...
గతంలో ఏ నాయకుడు ఈ విధంగా చేయలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు కానీ కుటుంబ సభ్యులతో విందు ఏర్పాటు చేయడం ఏపీ చరిత్రలో ఇదే తొలిసారి అనుకోవచ్చు. ఇది ఒక కొత్త సంప్రదాయానికి తెర తీశారు. రాజకీయాల్లో మంచి వాతావరణాన్ని నెలకొల్పేందుకు కూడా ఈ ఆత్మీయ విందులు ఉపయోగపడతాయని చెప్పాలి. లోకేశ్ భవిష్యత్ లో ముఖ్యమంత్రి స్థానాన్ని చేపట్టబోతున్నారని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అది ఎప్పుడంటే ఇప్పుడే చెప్పలేమని కొందరు సీనియర్ నేతలు సయితం అంటున్నారు. అది ఎప్పుడైనా జరగొచ్చు. అందుకే వారితో యాక్సెస్ పెంచుకునేలా.. ఒక రోడ్డు మ్యాప్ ను చినబాబు ఏర్పాటు చేసుకున్నారన్న కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి.