లడ్డూ ప్రసాదంలో కల్లీ జరిగింది చంద్రబాబు హయాంలోనే
తిరుమల లడ్డూ లో కల్తీ జరిిగిందని అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గడిచిన ఏడాదిన్నర కాలంగా లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ ఆధ్వర్యంలోని సిట్, లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు లేదని తన ఛార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొన్నా.. మరలా ప్లెక్సీలతో దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
2018లోనే....
వాస్తవానికి 2018లో సింథటిక్ ఘీ కొనుగోలు చేయడం ద్వారా చంద్రబాబు హయాంలోనే కల్తీకి బీజం పడిందని ఆధారాలతో సహా భరత్ వివరించారు. మరలా జూలై 2024 లో ఏ ఆర్ డెయిరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకుల నెయ్యిని నాణ్యత లేదని రిజెక్ట్ చేసిన తర్వాత కూడా.. కేవలం రెండు రోజుల్లోనే వైష్టవి డెయిరీ పేరుతో అదే నెయ్యి తిరిగి వస్తే ప్రసాదంలో ఎందుకు వాడారని నిలదీశారు. నెయ్యి కల్తీ అని తెలిసినా ఆ నెయ్యిని వాడిన అధికారులపై, టీటీడీ బోర్డుపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై, సిట్ నివేదిక వెలువడిన తర్వాత కూడా ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబు తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు, రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిష్టను మంటగలిపినందుకు హిందూ సమాజానికి, కోట్లాది మంది భక్తులకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.