వైసీపీ ప్రభుత్వం వైఫల్యమే.. ఇదిగో ఉదాహరణ
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఫైర్ అయ్యారు
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఫైర్ అయ్యారు. రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను జమ చేయకపోవడం వల్లనే ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. కోటిపల్లి - నరసాపురం రైల్వే లైను ఎప్పటికి పూర్తవుతుందని ఆయన ఈ సందర్బంగా ప్రశ్నించారు.
వాటా చెల్లించకపోవడం వల్లనే...
ఆంధప్రదేశ్ లో రైల్వే ప్రాజెక్టులు ఎందుకు జాప్యం అవుతున్నాయో కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఇచ్చిన వివరణతో తేటతెల్లమయిందని పవన్ తెలిపారు. అభివృద్ధిలో భాగమైన రైల్వే లైన్ల నిర్మాణం, విస్తరణలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదని అన్నారు. రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పూర్తి కావాల్సిన రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంతోనే ఆలస్యమవుతున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు.
ఈ లైన్లు ఎప్పటికి పూర్తవుతాయి?
కోటిపల్లి - నరసాపురం రైల్వే లైనుకు 25 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందని, ఆ మొత్తాన్ని ఇవ్వకపోవడం వల్లనే లైన్ ఏర్పాటు సాధ్యం కావడం లేదన్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 358 కోట్లు ఇస్తే పనులు మొదలవుతాయని చెప్పారు. ఈ రైల్వే లైను పూర్తయితే ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అలాగే నడికుడి - శ్రీకాళహస్తి ప్రాజెక్టుకు 1351 కోట్లు, కడప - బెంగళూరు లైనుకు 289 కోట్లు, రాయదుర్గం - తుముకూరు లైనుకు 34 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చ వలసి ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర వాటా చెల్లించకపోతే ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయని ఆయన ప్రశ్నించారు.