Butta Renuka : పోయిన చోటే వెతుక్కోవాలనుకుంటున్న బుట్టా రేణుక
మాజీ ఎంపి బుట్టా రేణుక ఎమ్మిగనూరులో గెలిచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు
ఆర్థికంగా బలమైన ఫ్యామిలీ. సామాజికవర్గం పరంగా కూడా జిల్లాలో పట్టున్న కుటుంబం. అయినా సరే ఒకే ఒక చిన్న తప్పు రాజకీయ జీవితాన్ని ఇబ్బందుల పాలు చేసింది. ఆమె బుట్టా రేణుక. 2014 ఎన్నికలకు ముందు బుట్టా రేణుక ఎవరో తెలియదు. ఆ ప్రాంతంలో కొందరికే పరిచయం. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2014లో కర్నూలు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. దీంతో ఆమె తొలిసారి పార్లమెంటు గడప తొక్కారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో మనసు టీడీపీ వైపునకు మళ్లింది. దీంతో బుట్టా రేణుక వైసీపీ ఎంపీ పదవికి రాజీనామా చేయకుండానే టీడీపీ మద్దతుదారుగా కొనసాగారు. దీంతో పార్టీ ఆమెను 2019 ఎన్నికల్లో పక్కన పెట్టింది.
జనం ఆదరించక పోవడంతో...
కానీ తాను పార్టీ మారిన టీడీపీ 2019 ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదు. అదే సమయంలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో బుట్టా రేణుక మరోసారి మనసు మార్చుకున్నారు. తిరిగి వైసీపీలో చేరారు. అయితే ఈసారి ఎమ్మిగనూరు అసెంబ్లీ టిక్కెట్ ను ఆశించారు. అనుకున్నట్లుగానే బుట్టారేణుకకు 2024 ఎన్నికల్లో ఎమ్మిగనూరు టిక్కెట్ లభించింది. కానీ ఈసారి జనం ఆదరించలేదు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులందరూ ఓడిపోవడంతో ఆమె కూడా ఓటమి పాలయ్యారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బుట్టా రేణుక రెడీ అవుతున్నారు. ఈసారి ఎన్నికల్లోనూ ఎమ్మిగనూరు నుంచి పోటీ చేయాలని భావించి అక్కడే ఎక్కువగా తిరుగుతూ ప్రజల్లో ఉంటూ మమేకమై వారి సమస్యలను అడ్రెస్ చేస్తున్నారు.
టీడీపీలో అసంతృప్తి....
బుట్టా రేణుక కుర్మి సామాజికవర్గానికి చెందిన . ఆమె మొత్తం 300 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయి జనం ఆదరణను పొందలేకపోయారు. కానీ కూటమి ప్రభుత్వంపై ప్రస్తుతం అసంతృప్తి ఎక్కువగా ఉందని భావించి బుట్టారేణుక తిరిగి నియోజకవర్గంలోనే కాదు పార్టీలోనూ యాక్టివ్ గా మారారు. ఈసారి కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గం టిక్కెట్ తనకే ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరొకవైపు ప్రస్తుతం ఎమ్మిగనూరు టీడీపీలో అసంతృప్తులు ఎక్కువ కావడంతో పాటు ఎమ్మెల్యేకు, ప్రధాన నేతలకు మధ్య గ్యాప్ పెరగడంతో వారిని ఆకట్టుకునేందుక ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద నాలుగేళ్ల ముందే బుట్టా రేణుక ఎన్నికలకు సిద్ధమయి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారన్న టాక్ ఎమ్మిగనూరులో వినపడుతుంది.
తరచూ భేటీ అవుతూ...
ఎమ్మిగనూరులో తరచూ సమావేశాలు నిర్వహించడం పాటు కార్యకర్తలతో భేటీ అయి వారి వ్యక్తిగత సమస్యలను తీర్చడంలోనూ బుట్టా రేణుక ముందున్నారని చెబుతున్నారు. అక్కడే తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు అక్కడ సిబ్బందిని నియమించి కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఆమె కృషి చేస్తున్నారని అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా బుట్టా రేణుక ముందున్నారని అంటున్నారు. పార్టీ మారిన బుట్టా రేణుక పదేళ్ల పాటు చట్ట సభలకు దూరమయి తిరిగి పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి బుట్టా రేణుకకు ఈసారి టిక్కెట్ వస్తుందా? రాదా? అని పక్కన పెడితే ఆమె నాలుగేళ్ల ముందు నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టడం కర్నూలు జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.