Montha Cyclone : మొంథా తుపాను పరిహారం కథ ముగిసినట్లేగా?
ఆంధ్రప్రదేశ్ లో మొంథా తుపాను గత ఏడాది అక్టోబరు నెలలో వచ్చింది
ఆంధ్రప్రదేశ్ లో మొంథా తుపాను గత ఏడాది అక్టోబరు నెలలో వచ్చింది. మొంథా తుపానుతో ఆంధ్రప్రదేశ్ లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనేక పంటలు దెబ్బతిన్నాయి. రైతులు నిలువునా మునిగిపోయారు. పంట చేతికొచ్చిన దశలో వచ్చిన తుపాను దెబ్బకు మొత్తం నాశనమయింది. ప్రభుత్వం పరిహారం ఇస్తుందేమోనని భావించారు. మొంథా తుపానుపై జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. మొంథా తుపాను దెబ్బకు వ్యవసాయ రంగం బాగా దెబ్బతినిందని, రెండు లక్షల మంది రైతులు నష్టపోయారని తెలిపింది. పదిహేడు రంగాలకు నష్టం వాటిల్లిందని, 5,244 కోట్ల సాయం చేయాలని కోరింది. 3.75 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని, ఆక్వా రంగానికి భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. తక్షణ సాయం కింద రూ.514 కోట్లు ఇవ్వాలని కోరింది.
ప్రభుత్వం మర్చిపోయినట్లే...
అయితే మూడు నెలలు గడుస్తున్నప్పటికీ రైతులకు పరిహారం మాత్రం అందలేదు. మొంథా తుపాను పరిహారాన్ని ప్రభుత్వం మర్చిపోయినట్లే కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు విడుదల కాలేదు. మొంథా తుపాను దెబ్బకు వరి, పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న, మిర్చి వంటి పంటలతో పాటు అరటి, బొప్పాయి, కంద వంటి పంటలను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ నష్టం అంచనాలే వ్యవసాయానికి 829 కోట్ల రూపాయలుగా అంచనా వేసింది. ప్రభుత్వ అంచనాలే ఇలా ఉంటే అంతకు మించి నష్టం జరిగి ఉంటుంది. కానీ పరిహారం కింద రైతులకు పైసా కూడా అందలేదు. దీంతో అన్నదాతలు కూటమి ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మూడు నెలలవుతున్నా...
ప్రభుత్వం కూడా రైతులకు పూర్తి పరిహారాన్ని అందిచడం కష్టమే. రాజధాని కోసం, విగ్రహాల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు పైసా కూడా విదల్చకపోవడం ఏంటని సోషల్ మీడియాలో విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అనేకరకాలుగా ఏపీకిసాయం చేస్తుండటంతో తుపాను బాధితులకు పరిహారం అందించడంలో మాత్రం కరుణ చూపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వం మొంథా తుపాను పరిహారం దాదాపు మర్చిపోయినట్లే.మరొక తుపాను వచ్చినా రైతులు తమ పంటను కాపాడుకోవాలంటే ముందుగా వారే బీమా చేసుకోవడం ఉత్తమం. అంతే తప్ప ప్రభుత్వాల మీద ఆధారపడటం సరికాదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అన్నదాతల ఆక్రందనను పట్టించుకోకపోవడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతున్నా పాలకులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు.