నేరుగా ఇక జగన్‌కు ఫోన్ చేయొచ్చు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించారు

Update: 2023-05-09 06:25 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ఆయన తన క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఏ సమస్యపైనైనా నేరుగా టోల్ ఫ్రీనంబరుకు ఫోన్ చేసి చెప్పవచ్చని తెలిపారు. పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలనే ఇలాంటి విన్నూత్న పథకాలను ప్రవేశపెడుతున్నామని జగన్ తెలిపారు. తన పాదయాత్రలో ప్రజా సమస్యలను చూసి అధికారులు అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని జగన్ వివరించారు.

నేరుగా 1902కు...
ప్రభుత్వ సేవలు అందకపోతే నేరుగా 1902 నెంబరుకు కాల్ చేయవచ్చని జగన్ తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లనే 90 నుంచి 95 శాతం సమస్యలను పరిష్కారం కావడం లేదన్నారు. పరిపాలనలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని, సమస్యల పరిష్కారంలో జాప్యం జరగకూడదనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ మనో వేదనను ఫోన్ చేసి చెప్పుకునే వీలు కల్పిస్తామని చెప్పారు. వివక్షకు తావులేని వ్యవస్థ తీసుకు రావాలనే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని తీసుకు వచ్చామని తెలిపారు.
పథకాలు అందకపోయినా...
అర్హత ఉన్నా పథకాలు అందకపోయినా వెంటనే ఫిర్యాదు చేయవచ్చని జగన్ తెలిపారు. అర్హత ఉన్న వాళ్లందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని జగన్ వివరించారు. అధికారులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోతే నేరుగా ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవచ్చని, వెంటనే సమస్యకు పరిష్కారం అయ్యేలా చూస్తామని జగన్ తెలిపారు. మారుమూల గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకూ ఎవరైనా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మీ సమస్యను నా సమస్యగా భావించి పరిష‌్కరిస్తానని జగన్ ప్రజలుకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.


Tags:    

Similar News