Nara Lokesh : బేస్ దెబ్బింటుందయ్యా లోకేశా.. జాగ్రత్త..వారిని దూరం చేయి

టీడీపీ నేతలు అత్యుత్సాహంతో నారా లోకేశ్ ను ప్రజల్లో పలుచన చేస్తున్నారు

Update: 2025-12-15 07:03 GMT

టీడీపీ నేతలు అత్యుత్సాహంతో నారా లోకేశ్ ను ప్రజల్లో పలుచన చేస్తున్నారు. ఆయన స్వయంగా రాజకీయంగా ఎదగాల్సిన సమయంలో తమ పదవులను కాపాడుకునేందుకు కొందరు.. పదవులు పొందేందుకు మరికొందరు లోకేశ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పార్టీ కార్యక్రమాల వరకూ ఈ భజన కార్యక్రమం ఉంటే పెద్దగా లోకేశ్ కు ఇబ్బంది ఉండదు. కానీ సోషల్ మీడియాలోనూ, జాతీయ మీడియాల్లోనూ లోకేశ్ ను పొగిడేందుకు నేతలు పోటీ పడుతున్నారు. సీనియర్ నేతల నుంచి జూనియర్ నేతల వరకూ ఇదే పనిలో ఉన్నారనిపిస్తుంది. లోకేశ్ కు మేలు చేద్దామేని భావించి ఒకరకంగా వారు నష్టం చేకూరుస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తించి వారిని కట్టడి చేసే పనిలో పడ్డారు.

ప్రశంసించడంలో తప్పులేదు కానీ...
తమ పార్టీకి చెందిన యువనాయకుడిని ప్రశంసించడంలో తప్పులేదు. ఆయన దృష్టిలో పడటానికి అనేక మార్గాలున్నాయి. నిజానికి నారా లోకేశ్ పదేళ్ల నుంచి రాజకీయాల్లోనే ఉన్నారు. నాడు బ్యాక్ అండ్ టీంలో ఆయన పార్టీ కోసం పని చేశారు. 2014 నుంచే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. లోకేశ్ కు ఇంకా సమయం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రజలు చంద్రబాబు పై నమ్మకం పెట్టుకుని ఉన్నారు. చంద్రబాబు అనుభవం, ఆయనకున్న పరిచయాలు రాష్ట్రానికి మేలు చేస్తాయని భావిస్తున్నారు. అది టీడీపీతో పాటు కూటమికి కూడా ప్లస్ పాయింట్. దానిని వదిలేసి ఇటీవల కాలంలో లోకేశ్ భజన అందుకుంటుడం వెగటు పుట్టించేలా ఉందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.
తాను కష్టపడి తెచ్చుకున్న ఇమేజ్ ను...
నిజానికి 2024 ఎన్నికలకు ముందే లోకేశ్ యువగళం పాదయాత్రను నిర్వహించి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేశారు. కొంత సక్సెస్ కూడా అయ్యారు. కార్యకర్తలకు లోకేశ్ అండగా ఉంటారన్న పేరు తెచ్చుకున్నారు. అయితే మరికొంత కాలం లోకేశ్ కు సమయం ఇవ్వాల్సి ఉంటుందన్నది కొందరి సీనియర్ నేతల అభిప్రాయం. తనంతట తానుగా లోకేశ్ మంత్రిగా, నేతగా, పార్టీ లీడర్ గా నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఆ సమయం ఇవ్వకుండానే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లోకేశ్ కు ఉన్న క్రేజ్ ను కూడా దిగజార్చేలా వ్యవహరిస్తుండటంపై చంద్రబాబు ఇటీవల సీరియస్ అయినట్లు తెలిసింది. కాబోయే డిప్యూటీ సీఎం, తర్వాత సీఎం అంటూ లోకేశ్ ను మాట్లాడే వారికి గతంలోనే చంద్రబాబు హెచ్చరించారు. ఇకనైనా లోకేశ్ రాజకీయ భవిష్యత్ గ్రౌండ్ లో జారిపోకుండా ఉండాలంటే నేతలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.


Tags:    

Similar News