Nellore Politics : కొందరంతే.. అలా వస్తారు.. అలా వెళ్లిపోతారంతే..!
పార్టీలు మారే రాజకీయ నేతలకు విలువ ఉండదు. అందులో ముఖ్యంగా ఒక స్థాయి నేతలకు పార్టీ మారితే అస్సలు పట్టించుకోరు
పార్టీలు మారే రాజకీయ నేతలకు విలువ ఉండదు. అందులో ముఖ్యంగా ఒక స్థాయి నేతలకు పార్టీ మారితే అస్సలు పట్టించుకోరు. నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి కూడా ఇదే కోవలోకి వస్తారు. నెల్లూరు కార్పొరేషన్ లో జరిగిన ఎన్నికల్లో అన్ని డివిజన్లను వైసీపీ నాడు గెలుచుకుంది. సామాజికవర్గం కోణంలో పొట్లూరి స్రవంతిని నాడు జగన్ మేయర్ గా ఎంపిక చేశారు. నాడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులుగా ఉండే మేయర్ స్రవంతి, ఆమె భర్తకు ఆ పదవి లభించింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారిద్దరూ కోటంరెడ్డి వెంట టీడీపీకి అనుకూలంగా మారారు. టీడీపీలో చేరారు. కానీ తర్వాత మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా ఆదాల ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేశారు.
తాము ఒకటి తలిస్తే...
కానీ బ్యాడ్ లక్.. వైసీపీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తుందని భావిస్తే కూటమి ప్రభుత్వం కొలువు దీరింది. అయితే తాను గిరిజన మహిళ కావడంతో తన పదవికి ఎసరు ఉండదని నమ్మినట్లుంది. వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే తిరిగి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే.. టీడీపీ చెంతకు చేరడానికి మొగ్గు చూపారు. కానీ కోటంరెడ్డి దగ్గరకు చేరనివ్వలేదు. దీంతో మేయర్ కొంత న్యూట్రల్ గానే ఉన్నారు. ఇప్పుడు మేయర్ రాజీనామా చేయాల్సి వచ్చిందంటే కారణం.. ఇటు టీడీపీ నేత కోటంరెడ్డి వద్ద నమ్మకాన్ని కోల్పోవడం... అటు వైసీపీ కార్పొరేటర్ల నుంచి కూడా సరైన మద్దతు లభించకపోవడమేనన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే స్రవంతి వైసీపీలోనూ మళ్లీ చేరలేకపోయారు.
రెంటికి చెడ్డ రేవడిలా...
ఇలా రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయినట్లు కనిపిస్తుంది. తాజాగా మేయర్ పదవికి పొట్లూరి స్రవంతి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను వెంటనే కలెక్టర్ ఆమోదించారు. ఈ నెల 18వ తేదీన అవిశ్వాసం చివరకు మేయర్ ఎన్నికకు దారితీసేలా ఉంది. తాత్కాలిక మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ ను కలెక్టర్ నియమించారు. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ పై ఎన్ని ఆరోపణలు చేసినా అవి చెల్లుబాటు కావు. విమర్శలకు వాల్యూ ఉండదు. నమ్మి పెద్ద పదవి ఇచ్చిన వారి వెంట ఉండకుండా స్రవంతి ఆమె భర్త ఇష్టమొచ్చిన రీతిలో పార్టీ కండువాలు మార్చేయడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. నిజంగా ఇది వారు చేజేతులా చేసుకున్నదే. కొందరంతే.. అలా వెలిగి.. అలా రాజకీయంగా ఆరిపోతారంతే. అందులో మేయర్ దంపతులు కూడా ఒకరని అనుకోవాల్సి ఉంటుంది. సింహపురి రాజకీయాలను శాసిద్దామనుకుని వచ్చిన వారు వేసిన తప్పటడుగులు రాజకీయంగా సమాధిని చేసినట్లయింది.