సమర్థ నేతలను వదులకోం... పనిచేయని వారిని దగ్గరకు రానివ్వం
సమర్థవంతమైన నేతలను పార్టీ వదులుకోబోదని, అలాగే పార్టీ కోసం పనిచేయని వారిని దగ్గరకు రానిచ్చేది లేదని చంద్రబాబు తెలిపారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. సమర్థవంతమైన నేతలను పార్టీ వదులుకోబోదని, అలాగే పార్టీ కోసం పనిచేయని వారిని దగ్గరకు రానిచ్చేది లేదని చంద్రబాబు తెలిపారు. నియోజకవర్గ ఇన్ ఛార్జిలు, ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు బాగా పనిచేస్తున్నారని, మరికొందరు ఎందుకో పార్టీ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని చంద్రబాబు తెలిపారు.
పోరాటం చేస్తేనే.....
వైసీపీ నేతల అక్రమాలపై నియోజకవర్గాల్లో పోరాటాలు చేయాలన్నారు. స్థానిక సమస్యలపై ప్రజలతో కలసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తాము పోరాటం చేయడం వల్లనే పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ ధర పెంచిందన్నారు. గతంలో కేవలం లీటరకు రూ.18 లు మాత్రమే ఇచ్చేదన్నారు. ఇక కొడాలి నాని క్యాసినో వ్యవహారంలో పార్టీ నేతలు బాగా పనిచేశారని కితాబిచ్చారు. ప్రజలను పీల్చుకుతింటూ కబ్జాలు చేస్తూ, వసూళ్లకు పాల్పడుతున్న వారిపై స్థానికంగా పోరాడాలని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ పేరున్న 14 పథకాలకు తొలగించి, ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి గొప్పలు చెప్పుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.