Chandrababu : చంద్రబాబు నయా నినాదం.. జగన్ కు కష్టాలు తప్పేట్లు లేవుగా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా హిందూ నినాదాన్ని ఎత్తుకున్నారు.

Update: 2026-02-06 06:56 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా హిందూ వాదాన్ని ఎత్తుకున్నారు. చంద్రబాబు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలా మాట్లాడలేదు. అయితే కేవలం జగన్ ను ఎదుర్కొనడానికే హిందూ ధర్మాన్ని చంద్రబాబు భుజానికి ఎత్తుకున్నట్లు కనపడుతుంది. కల్తీ నెయ్యి విషయాన్ని పక్కన పెట్టాలని, డబ్బులు కూడా సంపాదించారని పెద్దగా చంద్రబాబు విమర్శలు చేయకుండా ఏడు కొండల వాడి ప్రతిష్టను తగ్గించాలని వైసీపీ కుట్ర పన్నిందన్న కొత్త నినాదాన్ని చంద్రబాబు అందుకున్నారు. దీంతో జగన్ వచ్చే ఎన్నికల్లోనూ కూటమిని ఎదుర్కొనడం కష్టమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి కోట్లాది మంది భక్తులున్నారు. చాలా రోజుల తర్వాత.. అంటే రెండేళ్లలో తొలిసారి కూటమి నేతలు సమావేశమవ్వడం, తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకు రావడం కూడా తమకు కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.

ఓటు బ్యాంకు ఏకీకరణ కోసం...
అయితే కల్తీ నెయ్యి.. తిరుమలలో అవినీతి వంటి వాటికంటే గోవిందుడిపైనే కుట్రగా చంద్రబాబు అభివర్ణించడం చూస్తుంటే ఓటు బ్యాంకు ఏకీకరణ కోసమేనని విశ్లేషణలు వినపడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు ముఖ్యమంత్రిగా, విభజిత ఏపీలో ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎన్నడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. జగన్ పై అవినీతి ఆరోపణలు.. లక్షకోట్ల అవినీతి.. బాబాయ్ హత్య వంటి వాటితోనే ఎన్నికలకు వెళ్లారు. కానీ ఈ సారి మాత్రం చంద్రబాబు కొత్త తరహాలో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు కనపడుతుంది. హిందువులను ఏకం చేయడానికి, వైసీపీ నుంచి ఆ వర్గం ఓటర్లను దూరం చేయడానికి చంద్రబాబు ఈ నినాదాన్ని అందుకున్నట్లు చూసేవారికి ఎవరికైనా అనిపిస్తుంది.
కులాల రగడ ఉంది కానీ...
నిజానికి ఆంధ్రప్రదేశ్ లో కులాల రగడ ఉంది కాని, ఇప్పటి వరకూ మతాల ప్రస్తావన పెద్దగా రాజకీయాల్లోకి రాలేదు. కానీ 2029 ఎన్నికల్లో భిన్నమైన రాజకీయ వాతావరణాన్ని తలపించేలా ఉన్నాయి. వెంకటేశ్వరస్వామిని అపవిత్రం చేసే కుట్రలో భాగమేనని చంద్రబాబు అనడంలో అంతరార్థం కూడా అదే. దీనిని మహాకుట్రగా అభివర్ణించి జగన్ ను ఒక రకంగా డైలామాలో పడేశారు. కేవలం డబ్బుల మీద కక్కుర్తితో చేసిన పని కాదని, తిరుమల ప్రతిష్టను దిగజార్చాలనే ఈ మహాకుట్రకు తెరలేపారని చంద్రబాబు అనడం చూస్తుంటే ఖచ్చితంగా జగన్ కు ఇక రాజకీయ కష్టాలు మొదలయినట్లేనని అంటున్నారు. మరి చంద్రబాబు ఈ నయా నినాదం ఏ మేరకు పనిచేస్తుందన్నది చూడాలి.


Tags:    

Similar News