Chandrababu : గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలి

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు

Update: 2026-02-10 06:24 GMT

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌‌లోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయంపై విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, తాగునీటి భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమని వివరించిన చంద్రబాబు వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపైనా సవివరంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ ఆర్డర్‌ కారణంగా ప్రాజెక్టు అమలులో అవరోధాలు ఏర్పడుతున్నాయని,పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్‌మెంట్ చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్–IIకి ఆర్థిక సహాయం అందించాలని, ఫేజ్–IIలో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉందని తెలిపారు. వీటికి అదనంగా సుమారు రూ.32,000 కోట్ల నిధులు అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

వరద జలాలలను...
గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు రూపొందించామని, తాగునీరు, సాగునీరు, పరిశ్రమల అవసరాలు తీర్చే కీలక ప్రాజెక్టు అని చెప్పారు. జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసి, సాంకేతిక–ఆర్థిక సాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాలని, వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ తుది నివేదిక గెజెట్‌లో ప్రచురించాలని కోరారు. ట్రిబ్యునల్ నివేదికను వెంటనే గెజెట్‌లో ప్రచురించి, వంశధారపై నిర్మించ తలపెట్టిన నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని తెలిపారు. గోదావరి జలాల పంపకంపై ఏపీ-తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోందని, నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రిని కోరారు. ఎగువ కృష్ణాపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే దిగువ ప్రవాహ జలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వివరించారు.




Tags:    

Similar News