Jana Sena : జనసేన బాలినేని దూరం పెట్టిందా? మిగిలిన నేతలకున్న ప్రాధాన్యత లేదా?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి భవిష్యత్ లోనూ జనసేనలో పదవులు దక్కే అవకాశాలు లేనట్లే కనిపిస్తుంది.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి భవిష్యత్ లోనూ జనసేనలో పదవులు దక్కే అవకాశాలు లేనట్లే కనిపిస్తుంది. ఆయనకు ప్రాధాన్యత కూడా పార్టీలో అంతగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు సమావేశాలకు ఆహ్వానించడం తప్పించి ప్రత్యేకించి బాలినేనికి జనసేనలో గుర్తింపు లేదన్నది వారి అనుచరుల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. బాలినేని శ్రీనివాసరెడ్డి తర్వాత చేరిన వారికి మాత్రం పార్టీ పదవులు దక్కుతున్నాయి. కానీ బాలినేనికి మాత్రం పదవులు దక్కడం లేదన్న ఆవేదన వారిలో కనిపిస్తుంది. జగన్ కు అత్యంత దగ్గర బంధువయినా పార్టీని వదులుకుని, వైఎస్ కుటుంబాన్ని కాదనుకుని వచ్చిన తమ నేతకు కనీసం పదవి ఇచ్చేందుకు జనసేనాని ఇష్టపడటం లేదన్న నిరాశ వారిలో కనిపిస్తుంది.
తనకంటే వెనకొచ్చిన వారికి...
బాలినేని శ్రీనివాసరెడ్డి తర్వాత చేరిన సామినేని ఉదయ భానుకు కృష్ణా జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. అలాగే తర్వాత జనసేన పార్టీలో చేరిన కిలారి రోశయ్యకు బాపట్ల జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డికి మాత్రం ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టలేదని, దీనికి కారణం ఏంటని కొందరు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. తమ నేత చేసిన తప్పేంటి? అని బాలినేని అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఆ ఇద్దరి నేతల కంటే రాజకీయాల్లో సీనియర్ నేత, అలాగే ఎక్కువ సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీ ఎందుకు ఉపయోగించుకోవడం లేదన్న సందేహంఅందరిలోనూ కలుగుతుంది.
పార్టీ పదవి కూడా...
అదే ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరిన సమయంలో తనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశించారు. అది రాలేదు. కనీసం జిల్లా అధ్యక్ష పదవి అయినా దక్కుతుందని భావించారు. అది కూడా ఇప్పటివరకూ దక్కలేదు. దీంతో ఆయన కూడా ఒకింత అసంతృప్తికి లోనవుతున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. తిరుమల లడ్డూ వివాదాన్ని వదిలేయాలని ఆయన కోరడం ఒక రకంగా పార్టీ వైఖరిని వ్యతిరేకించడమేనని అంటున్నారు. పవన్ కల్యాణ్ తిరుమల లడ్డూ విషయంలో వైసీపీకి ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెబుతుంటే బాలినేని మాత్రం లడ్డూ టాపిక్ వద్దనడం ఇప్పడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చ మొదలయింది.