TDP : అన్ని సందేహాలకు ఫుల్ స్టాప్ పడినట్లేనా? బాబు స్ట్రాటజీ వర్కవుట్ అయినట్లేనా?
కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ సభ సక్సెస్ కావడంతో చంద్రబాబు నాయుడు హ్యాపీ ఫీలవుతున్నారట.
కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ సభ సక్సెస్ కావడంతో చంద్రబాబు నాయుడు హ్యాపీ ఫీలవుతున్నారట. సభను సక్సెస్ చేసినందుకు రాయలసీమ టీడీపీ నేతలతో పాటు సభ పర్యవేక్షణ బాధ్యత అప్పగించిన మంత్రులను కూడా చంద్రబాబు అభినందించారు. జనసమీకణ చాలా చక్కగా జరిగిందని, లక్షల మంది వచ్చినా ఎవరూ ఇబ్బందులు పడకుండా తిరిగి తమ ఇళ్లకు చేరేలా చర్యలు తీసుకోవడంలో సక్సెస్ అయ్యారంటూ నేతలను ప్రశంసించారని తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సభ ఎందుకు సక్సెస్ చేయాలో తెలుసు. కేవలం ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని మాత్రమే కాదు.. రాయలసీమలో కూటమి గట్టిగా స్ట్రాంగ్ గా ఉండేందుకు ఈ సభ ఉప యోగపడుతుందని ముందుగానే అంచనా వేసి నేతలకు ఖచ్చితమైన దిశానిర్దేశం చేశారు.
కూటమిలో విభేదాలు...
మరొకవైపు ఈ సభతో అనేక సందేహాలకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. ముఖ్యంగా కర్నూలు సభలో పవన్ కల్యాణ్ మరోసారి పదిహేనేళ్లు కూటమి కలిసి ఉండాలని చెప్పడం కూడా అందులోనిదే. నిజానికి చంద్రబాబు కూడా కోరుకున్నదనే. ఇప్పటి వరకూ గత కొద్ది రోజులుగా కూటమి పార్టీల్లో సఖ్యత లేదని, అసెంబ్లీలో జరిగిన వివిధ పరిణామాల నేపథ్యంలో గ్యాప్ పెరిగిందన్న భావన అన్ని పార్టీల్లో వ్యక్తమవుతుంది. అలాగే టీడీపీ క్యాడర్ తో పాటు నేతల్లోనూ ఒకింత ఆందోళన నెలకొంది. అయితే కూటమి చెక్కు చెదరలేదని చెప్పడానికి, మరో పదిహేనేళ్ల పాటు కూటమి కలిసి కట్టుగా ఉంటాయని చెప్పడంతో వారి ఆందోళనకు కూడా చంద్రబాబు ఈ సభ ద్వారా తెరదించినట్లయింది.
జగన్ పార్టీకి...
అలాగే రాయలసీమ అంటే జగన్ పార్టీకి మంచి పట్టుందన్న భావన ఉంది. గత ఎన్నికల్లో తక్కువ స్థానాలు వచ్చినా తిరిగి జగన్ సీమలో పుంజుకుంటారన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. అందుకే మొన్న మహానాడు నిర్వహించిన చంద్రబాబు నాయుడు నిన్న కర్నూలులో ప్రధాని మోదీ సభను నిర్వహించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయించారు. దీంతో అభివృద్ధితో పాటు సంక్షేమంలోనూ రాయలసీమకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు ఈ కర్నూలు సభ ఉపయోగపడిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందుకే ఏరికోరి చంద్రబాబు నాయుడు సీమలో సత్తా చాటి తమ చేవ తగ్గలేదని నిరూపించుకున్నారంటున్నారు.