Andhra Pradesh : అన్నదాతకు తీపికబురు.. రేపే డబ్బులు.. అందకుంటే ఇలా చేయండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తుంది. కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో జరిగే సభ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46.86 లక్షల మంది రైతుల కు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఐదు వేల రూపాయలు, కేంద్రం నుంచి రెండు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు జమ అవుతాయి. రైతులు తమ ఖాతాల్లో నగదు పడకపోతే సంబంధిత వ్యవసాయ అధికారులను, రైతు సేవా కేంద్రాల్లోనూ సంప్రదించాలని ప్రభుత్వం తెలిపింది.
ఇందుకోసం నిధులను...
గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అందచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తొలి విడత ఈ ఏడాది ఆగస్టు నెలలో నిధులను విడుదల చేసింది. నేడు రెండో విడత కింద ఈ పథకం కింద 3,174 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. రైతులకు ఈ సీజన్ లో విత్తనాలు, పురుగు మందులు, ఇతర వ్యవసాయ పనులకు ఉపయోగపడతాయని ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయనున్నాయి. అయితే అర్హులైన లబ్దిదారులందరికీ ఈ పథకం కింద రేపు నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
నిధులు అందని వారు...
నిధులు అందని వారు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రంలో కానీ, వ్యవసాయ అధికారిని కానీ సంప్రదిస్తే అందుకు కారణాలు చెబుతారని, అర్హులైతే వారికి కూడా ఈ పథకం కింద నిధులు మంజూరవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎవరైనా రైతు మరణిస్తే వారికి సంబంధించిన వారసులకు డెత్ మ్యుటేషన్ చేసే పద్ధతిలో నిధులను దక్కేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో పాటు ప్రత్యేకంగా ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబరు ను ఏర్పాటు చేసి అర్హులైన రైతులందరి నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వారికి కూడా పథకం వర్తించేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. రైతులు ఆందోళ చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.